ఈ పుట ఆమోదించబడ్డది

కర్త కృష్ణదేవరాయలనుట కాశ్వాసాంతమునందును కృత్యాదియందును జెప్పబడుటమాత్రమేకాక "పలికితు త్ప్రేక్షోపమల" నిత్యాది పద్యములో నుదాహరింపబడిన తద్రచిత గ్రంధనామములును తత్కర్తృత్వమును స్థాపించుచున్నవి.

ఈ కృష్ణరాయలు కవిత్వమునందు సమర్థుడని యాతనికాలమునం దాముక్తమాల్యదను రచించుటకుముందే యాతని యాస్థానకవులు చెప్పియుండుటకూడ విష్ణుచిత్తీయము కృష్ణరాయకృత మగుటనుస్థిరీకరించుచున్నది. ఈరాజు కవిత్వమునందు నిపుణు డనుటను సూచించుచు రాజునుగూర్చి "కవితాప్రావీణ్యఫణీశ" యను విశేషణము నుపయోగించిన పారిజాతాపహరణములోని నంది తిమ్మనార్యునిపద్యము నొకదానిని నిందు క్రింద బొందుపఱచుచున్నాను:-

క. శ్రీ వేంకటగిరివల్లభ

సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ

జీవితనాయక కవితా

ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా. ఆ .4

అక్కడక్కడ వ్యాకరణ స్ఖాలిత్యము లున్నను కటువుగానున్నను మొత్తముమీద విష్ణుచిత్తీయముయొక్క కవిత్వము మిక్కిలి ప్రౌడముగాను, అర్థగాంభీర్యము కలదిగాను, అలంకార బహుళమయి స్వభావ వర్ణనలు కలదిగాను ఉన్నది. అందుచేతనే రేఫ శకట రేఫములనిమిత్తమయి పెనగులాడిన యప్పకవివంటివాడు సహితము యతిస్రాసముల యందు ద్విరేఫమైత్రి సంగీకరించిన యీ కవిగ్రంథమును గుణబాహుళ్యమును బట్టి లాక్షణికమైనదానినిగా సంగీకరించి తన లక్షణగ్రంథమునం దాముక్తమాల్యదనుండి పద్యములను లక్ష్యములనుగా దీసికొని యున్నాడు.