పుట:AndhraKavulaCharitamuVol2.pdf/267

ఈ పుట ఆమోదించబడ్డది

ములో బ్రయోగ"మని యప్పకవి వ్రాసియుండుటచే నిది రాచమల్లు వారను నింటిపేరుగల కవులచే రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. ఆకవు లన్నదమ్ములయి యుండవచ్చును.


శా. శ్రీరామామణి సీత నాధునియురస్సీమ న్నిజచ్ఛాయ గ
   న్నారం గన్గొని యాత్మ నన్యవనితేర్ష్యం బూన దత్కంధరన్
   హారం బున్చుచు నింక జూడుమన దా నౌటం ద్రపంజెంద జే
   ల్వారున్ రాముడు ప్రోచు గాత మిక దమ్మాధీశుతిమ్మాధిపున్.


శా. చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మ విధ్వస్తపా
   షండం బైనత్రిలింగభాగవతషష్ఠస్కంధ కావ్యంబు నీ
   కుం డక్కెం జతురానసత్వగుణయుక్తు ల్మీఱ వాణీమనో
   భాండారోద్ధత చూరకారబిరుదప్రఖ్యాత సార్థంబుగన్.

అని కవిసంశయవిచ్ఛేదములోను, సర్వలక్షణసారసంగ్రహములోను గవులషష్ఠమునుండి యుదాహరింపబడిన పద్యములనుబట్టి యీగ్రంథము తిమ్మయపుత్రుడయిన తిమ్మయ కంకితము చేయబడినట్టు తెలియుచున్నది. ఈతిమ్మయ యచ్యుతదేవరాయని మంత్రులలో నొక డయిన ట్లొకానొకరు వ్రాసియున్నారు. అదియే నిజమైన పక్షమున బమ్మెరపోతరాజకృతభాగవతము శిథిలము కాగా పోయినభాగములలో నొకటియైన యీషష్ఠస్కంధమును 1530-42 సంవత్సరముల మధ్యను రాచమల్లువారు చేసియుందురు. దీనియందు శృంగారరస మధికముగా వర్ణింపబడినందున దీనికే శృంగారషష్ఠమని నామాంతరము కలిగియున్నట్టు కనబడుచున్నది. అప్పకవ్యాదులుదాహరించిన శృంగారషష్ఠములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను-


గీ. తల్లి యును దండ్రి దైవంబు తలప గురుడ
   కాడె ? యిత డేమిచేసిన గనల దగునె ?