ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలకు సంస్కృతాంధ్రములయం దసాధారణపాండిత్యము గలిగియుండుట నాతడు రచియించిన యాముక్తమాల్యదయే సహస్రముఖముల ఘోషించుచున్నది. ఆముక్తమాల్యద కృష్ణరాయ కృతము కాదనియు దానిని తదాస్థానకవియైన పెద్దనార్యుడు రచించి పుస్తకమున దనప్రభువునకు గ ర్తృత్వమును నారోపించెననియు వాడుక కలదుగాని యదియంతగా విశ్వసనీయముగాదు. కృష్ణదేవరాయ లల్లసానిపెద్దనను, రామరాజభూషణుని, ప్రబంధములను రచించి తెమ్మని యాజ్ఞాపించెననియు, తదాజ్ఞానుసారముగా వారిరువురును గ్రంథరచనచేసి తమప్రబంధములను దీసికొనిరాగా జూచి రాజు వసు చరిత్రమునకంటె మనుచరిత్రము లేతపాకమున బడినదని యభిప్రాయము తెలిపెననియు, అందుమీద పెద్దన "యాముక్త మాల్యద" యనుపేర విష్ణుచిత్తుని చరిత్రమును రచియించి తీసికొనిరాగా విష్ణుచిత్తీయము ముదురుపాకముగా నున్నదనియె ననియు, చెప్పుదురుగాని యిదియంతయు నిటీవలివారి స్వకపోలకల్పితము. వసుచరిత్రమును రచియించిన రాజరాజభూషణుడు కృష్ణదేవరాయని కాలమునం దుండెనో లేడోయని సందేహింపవలసి యున్నది. ఉండిన పక్షమున నత డాకాలమున బిన్నవయసువాడయి యుండవచ్చును. ఆముక్తమాల్యదయు మనుచరిత్రమును రచియింప బడినతరువాత నేబదియేండ్లకుగాని రామరాజభూషణుడు వసుచరిత్రమును రచియింపలేదు. కాబట్టి పయికథ యెంతమాత్రమును నమ్మదగినదికాదు. ఆముక్తమాల్యదకును, మనుచరిత్రమునకును శైలియందు విశేష భేద ముండుటచేతను, ఆముక్తమాల్యద వ్యాకరణదోషయుక్త మయినదిగా నుండుటచేతను, ఆరెండుపుస్తకములు నేకకవిచే రచియింపబడినవి కావని నిశ్చయముగా జెప్పవచ్చును. పెద్దనకవిత్వములో లేనియికారసంధులును, తత్సమశబ్దములం దకారసంధులును, క్త్వార్థకసంధులును, ఆముక్తమాల్యదయందు గానబడుచున్నవి అందు