పుట:AndhraKavulaCharitamuVol2.pdf/221

ఈ పుట ఆమోదించబడ్డది

నీతనికాలములోనివాడే యయినందున నతడు పదునాఱవశతాబ్దాంతమునందును పదునేడవశతాబ్దాదియందును నుండినవాడు. ఈకవితాను బహుళాశ్వచరిత్రమును జేయకుమునుపు కృష్ణకథ నొకదానిని జేసి దానిని రామభద్రున కంకితము చేసినట్లు బహుళాశ్వచరిత్రములో రామభద్రుడు త న్నుద్దేశించినట్లీ క్రిందిపద్యములో జెప్పుకొన్నాను.


ఉ. దామెరవేంకటప్రభువతంసుని వేంకటభూప మాపయిన్
   శ్రీమెఱయంగ గృష్ణకథ చెప్పితి నిప్పుడు నీదుతండ్రియున్
   మామకభక్తు డాతనికి మాకును భేధము లేదుగాన నీ
   వామహిమాడ్యుపేర బహుళాశ్వచరిత్రము చెప్పు మెప్పుగన్.

ఈబహుళాశ్వచరిత్ర మయిదాశ్వాసములు కలదయి రసవంతమయి సలక్షణమయినదిగా నున్నది. అందుండి రెండుపద్యముల నిందుదాహరించుచున్నాను.


చ. తటముల జుట్టుకొన్న బిగిదన్నినక్రొన్ననపొన్నగున్నలన్
   జిటపొటమంచు మంచుజడి చిల్కెడిగొజ్జగికిన్ రసాలపున్
   జిటిపొటితేనెవానలకు జేసినకాల్వలతేటనీటిప
   ల్లటముల నిక్కు నక్కొలకులచ్చికి మెచ్చిరి వచ్చినెచ్చెలుల్. [ఆ.2]


ఉ. రాముని జూచి కామునిశరంబుల గాసిలి చేష్టదక్కి కాం
   తామణి యుండెనోర్తు రఘునందనపాదరజంబుచేత మున్
   గోమలిరేఖ ఱాతి కొడగూడెనొ లేదొ యటంచు నెంచి లీ
   లామహితాంగ మొందగ శిలామయరూపము దాల్చెనోయనన్. [ఆ.4]