ఈ పుట ఆమోదించబడ్డది

నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క

కృతి వినిర్మింపు మిక మాకు బ్రియముగాగ.

అయినను కృష్ణదేవరాయలు రచియించిన యీసంస్కృత గ్రంథము లేవియు నిప్పుడు గానరాకున్నవి. సంస్కృతముమాట యెటున్నను కవులను బ్రోత్సాహపఱిచి కావ్యములను చేయించియు తాను జేసియు తెలుగుభాష కీయన మహోపకారము చేసి యున్నాడు. ప్రబంధరచనము క్రొత్తగా నీ కృష్ణ దేవరాయల కాలమునందే యారంభమైనది. అంతకు బూర్వమునందున్న కవులు సంస్కృతమునుంచి యితిహాసములను బురాణములనుమాత్రము తెనిగించుచు వచ్చిరి. వారిలో గేతన యనుకవి యాజ్ఞవల్కధర్మశాస్త్రమును, దండివిరచితమైన దశకుమారచరిత్రమును, శ్రీనాథుడనుకవి శ్రీహర్ష విరచితమైన నై షధకావ్యమును పద్యకావ్యములనుగా దెలిగించిరి. బాణవిరచితమైన కాదంబరి యాంధ్రీకరింపబడినట్టు కానబడుచున్నది గాని కొన్ని లక్షణగ్రంథముల యందుహరింపబడిన పద్యములుతక్క గ్రంథ మెక్కడను పూర్ణముగా దొరకకున్నది.

ఏది యెట్లున్నను గృష్ణదేవరాయనికి బూర్వకాలమునందలికవులు రచించిన యాంధ్రగ్రంథములన్నియు సంస్కృతమునుండి చేసిన భాషాంతరములేకాని స్వబుద్ధికల్పితముగా రచించిన నూతనగ్రంథమం దొక్కటియు గానరాదు. తెలుగునందు నూతనముగా ప్రబంథరచనచేసి తరువాతివారికి దారిచూపినవాడు కృష్ణదేవరాయని యాస్థానకవియైన యల్లసాని పెద్దనామాత్యుడు. ఆతడు రచియించిన మొదటి ప్రబంధము స్వారోచిషమనుసంభమను మనుచరిత్రము. ఈ గ్రంథమునందలి కథ మార్కండేయ పురాణమునుండి గ్రహింపబడినది. మొట్టమొదట నీమనుచరిత్రమును ప్రబంధరూపమున రచింపబట్టియే పెద్దనార్యున కాంధ్రకవితాపితామహు డను బిరుదనామము కలిగినది.