పుట:AndhraKavulaCharitamuVol2.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

ఈకవి కాశ్యపగోత్రుడు; శఠగోపతాపసేంద్ర శిష్యుడు. ఈతని కవిత్వము సలక్షణమయి వినసొంపుగా నుండును. ఈతని కువలయాశ్వచరిత్రములోని కొన్నిపద్యముల నిందుదాహరించుచున్నాను.


చ. మిటిమిటి యెండవేడి బలిమిం దెలిదమ్ముల ఱేకుసందులం
   జిటుకుమనంగ గూడి నివసించి తదగ్రమరంద మప్పట
   ప్పటికిని మూతిముట్టి పయిపై నది చల్లబడంగ బ్రొద్దుగ్రుం
   కుట గని యంతటం బొదలు గోడెమిటారపు దేటు లత్తఱిన్. [ఆ.1]


చ. మునివనితల్ శచీముఖతమోనిభవేణులకుం బతివ్రతా
   జనతతి దెల్పుచో బరవిచారముగా గను వేల్పుటొజ్జజ
   వ్వని మొగ మవ్వలం జొనుప వారలు నవ్వుదు రామె సిగ్గుపెం
   పున దలవంచు జందురుడు పొంగగ నయ్యయియాగ వేళలన్. [ఆ.2]


చ. తలపున నెంత మోహపరితాపముగల్గిన దాచుకొందురో
   యలయిక లేక నీకరణి నంగడిబెట్టుదురో వధూటికల్
   పలుకవు నిన్నునంటికులభామల గానమె వారి కాత్మనా
   థులపయి బాళిలేదొ తమిదొట్టినపట్టున మట్టు పెట్టరో. [ఆ.3]


మ.అత డచ్చో దురగంబు నెక్కి హృదయాబ్జాపూర్ణ మోదార్ణ వాం
   చితుడై నారల వెన్క నుంచుకొని యక్షీణైక్యమాణిక్యదీ
   ధితిజాతామృతరుగ్వితాన మగుదై తేయాధినాధాయతా
   యతనం బల్లవ నిర్గమించి పురబాహ్యక్షోణి కేతెంచుచున్. [ఆ.4]


చ. వెలుపలిరచ్చ నొక్కయెడ వేలుపుసానికి వన్నెకానికిన్
   గలహము కల్గెనేని గుఱికానితనంబున వచ్చి రోసపుం
   బలుకుల వాదు రేచి సిగపట్లకు డగ్గఱజేసి క్రొవ్వునం
   గలకల నవ్వువాడు చవుకట్లసియాడ రుమాలువీడగన్. [ఆ.5]