పుట:AndhraKavulaCharitamuVol2.pdf/213

ఈ పుట ఆమోదించబడ్డది

శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
   జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
   భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
   జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.


38. తెనాలి అన్నయ్య

ఈకవి సుదక్షిణాపరిణయమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు.


శా. శ్రీలీలాహరినీలపీఠరుచిరశ్రీవత్ససంపన్నవ
   క్షోలాలిత్యుడు వేంకటేశుడు కృపం గోనేటిరామక్షమా
   పాలస్వామిసమస్తరాజ్యభరణోపాయాధికున్ హృద్యవి
   ద్యాలోలున్ బులిజాలరామవిభుసోమామాత్యునిం బ్రోచుతన్.

సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకితము చేయబడినట్టు తెలిసికోవచ్చును. ఆసోమామాత్యు డొకనాడు సభాసీనుడయి తన్ను రావించి కృతి వేడిన ట్లీక్రిందిపద్యములలో గవి చెప్పుకొనియున్నాడు-


మ. కవులున్ గాణలు జాణ లార్యులు హితుల్ కాంతానమూహంబు లు
    త్సవలీలం దను గొల్వ నిండుకొలువై సత్కావ్యగోష్ఠీవిశే
    షవినోదై కపరాయణత్వమును రాజ్యశ్రీవిహారంబు బ్రా
    జ్యవివేకంబు దనర్ప రామవిభుసోమామాత్యు డత్యున్నతిన్.