పుట:AndhraKavulaCharitamuVol2.pdf/208

ఈ పుట ఆమోదించబడ్డది

చూపుట కనేక కథలు కల్పింపబడినవి. అందు గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-

1. ఈకవి లేటవరపు పోతురాజను క్షత్రియుని యింటికి బోగా నతడు కవి కేమయిన నియ్యవలసివచ్చునని యింటనుండియు లేడనిపించెనట అప్పుడు రామకవి,


క. కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నవేయునప్పటికి బోతురాజు మృతుడయ్యెనట! దహన నిమిత్త మయి బంధువు లింటినుండి శవమును గొనిపోవనున్నప్పు డాతనిభార్యవచ్చి కవికాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా గరుణించి,


క. మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కటుకు మీదనుండి దిగివచ్చెనట!

2. ఈకవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు ఉంగుటూరను స్వగ్రామమునం దొక పెద్దయిల్లు కట్టించి, దానిని జూపుటకయి కవిని లోపలికి దీసికొనిపోయి యొకగదిలో విడిచి బావమఱది పరియాచకమున కయి తాను మఱియొకచోట దాగియుండెనట. కవి యాయింట దిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,


గీ. అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.