పుట:AndhraKavulaCharitamuVol2.pdf/207

ఈ పుట ఆమోదించబడ్డది

   చారు డనంగ రాద యనిశంబును వేశ్యలతోరమించినన్,
   బోరున మీర లాతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్.

ఇటువంటి సిద్ధాంతములే మనదేశములో నీతికిని మతమునకును గూడ నమిత మైన చెఱుపును గలుగజేయుచున్నవి. నీతిని విడిచినమత మెప్పుడును దేవునికి ప్రీతికరము కానేరదు. వై జయంతీ విలాసములోని,


చ. ఇనసమతేజులౌనృపులనెల్ల మహమ్మదుశాహియేలు, నీ
   యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోలకొండ ద
   ద్ఘననగరస్థలిం గరణికం బొనరించుచు దమ్మమంత్రి యా
   జనపతి రమ్ము పొమ్మన బ్రజ ల్జయవెట్ట గృహస్థు లౌననన్

అను పద్యమునుబట్టి యీతిమ్మకవి మహమ్మదుశాహి గోలకొండ నవాబుగా నుండిన 1581 వ సంవత్సరమునకును 1611 వ సంవత్సరమునకును మధ్యకాలములో వై జయంతీవిలాసమును రచియించిన ట్లీవఱకే తెనాలి రామకృష్ణకవి చరిత్రమునందు దెలుపబడినది. పయిపద్యములవలననే కవియొక్క కవిత్వరీతి తేటపడునుగనుక వేఱుగ బద్యముల నుదాహరింపవలసిన యావశ్యకము లేదు.


36. తురగా రామకవి

ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు. ఇతడు నూరు నూటయేబది సంవత్సరముల క్రిందట నుండినట్టును, ఆడిదము సూరకవి తోడి సమకాలికు డయినట్టును ఎల్లవారును వాడుచున్నారు. వేములవాడ భీమకవి దరువాత దిట్టుకవిత్వమునం దీతనితో సమానుడు మరియొకడు లేడు. భీమకవివలెనే యిత డాడినమాట యెల్ల నగుచు వచ్చెననియు, అందుచే నెల్లవారు నీతనికి జడియుచు వచ్చిరనియు,