పుట:AndhraKavulaCharitamuVol2.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

నము నింతగా జేసికొనక నమ్రతనుజూపినచో నధికశ్లాఘాపాత్రుడయి యుండును. ఈతనినివాసస్థలము కృష్ణామండలములోని తెనాలియగ్రహారము;ఇతనిపూర్వులు కాపుర ముండినచోటు తెనాలికి రెండుక్రోసుల దూరములోనున్న గార్లపాడు గ్రామమనియు, ఇతడు తననివాసము నచ్చటనుండి తెనాలిగ్రామమునకు మార్చుకొనెననియు నొకరు వ్రాసి యున్నారు. ఇతడు చిన్నతనములో బట్టుపల్లెయను గ్రామమునందుండు బట్రాజులతో సాంగత్యముచేసి, వారిచెలిమిచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును కవిత్వకౌశలమును సంపాదించి బుద్ధిబలముచేత ప్రబంధ కవీశ్వరుడయి వన్నెకెక్కెనట. ఇతడు రచియించిన పుస్తకము పాండురంగమహాత్మ్య మను స్థలపురాణము. ఇందు గొన్నివర్ణనలు విలక్షణముగానుండును. "పాండురంగ విభుని పదగుంభనంబును" అన్నట్లితని కవిత్వము పదముల కూర్పుచేత మేలిమి గన్నది. అందు నిరర్థకపదము లెక్కడనోకాని కానబడవు.


క. అటు లేనియు జెప్పెద నీ

పొటిపొటితలపోత లెల్ల బోవ నడువు మా

రట ముడుగు నెమ్మనము నొ

క్కటిగా నొనరించి గట్టిగా విను మధిపా.


ఇత్యాదిపద్యములలో గట్టిగా లోనగుపదము లొకానొకటి యక్కడక్కడ వ్యర్థములుగాదోచినను మొత్తముమీద బదసందర్భమితనికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరిన దని చెప్ప వలనుపడదు. ఈపాండురంగమాహాత్మ్యమునకే పాండురంగవిజయమని నామాంతరము గలదు. ఇదిగాక పాండురంగవిజయమని రామకృష్ణకవివిరచితగ్రంథము వేఱొకటియున్నదని కొంద ఱందురుగాని యామాట పాటింప దగినది కాదు. ఈకవికి తరువాత నల్పకాలములోనే యున్నయప్పకవి లోనుగాగలలాక్షణికు లొక్కరును పాండురంగవిజయ మున్నదనిచెప్పి దాని