ఈ పుట ఆమోదించబడ్డది

రము గల తిమ్మరుసు (సాళువతిమ్మరాజు) నెల్లూరిమండలములోని కనిగిరి (కనకగిరి) కి రాజయినట్టియు, ఓరుగంటి ప్రతాపరుద్రుని సంతతి వారిలో గడపటివా డయినట్టియు వీరరుద్రగజపతి కాతనికొమార్తెను గృష్ణరాయల కిచ్చి వివాహము చేయుమని సందేశము పంపెను. ఆతడు హీనకులుడైన కృష్ణరాయనికి దనపుత్రిక నియ్యనని స్పష్టముగా జెప్పి యటువంటి బలవంతునితో విరోధము పెట్టుకొనుటకు సాహసింపజాలక కొమార్తె నిచ్చెద నని చెప్పి రాయలను మంత్రిసహితముగా రప్పించి, అంత:పురము చొచ్చినప్పుడు రాజుప్రాణములు గొన బ్రయత్నించెను. కోటలో బ్రవేశించిన తరువాత మంత్రియైన తిమ్మరు నీ మోసమును గనిపెట్టి రాజుప్రాణములు కాపాడుటకై తాను రాజువేషమును వేసికొని కృష్ణరాయనికి సేవకవేషమువేసి తన వెంటగొనిపోయెను. కాని కృష్ణరాయనిచేతివ్రేలినున్న ముద్రయుంగరమునుబట్టి యతడేరాజని యత:పురములోని వారానవాలు పట్టిరి. ప్రాణోపద్రవము సంభవింపనున్న యా సమయమునందు ధీమంతుడైన మంత్రియుపాయము వలన రాజు తానును మంత్రియు నెట్లో ప్రాణములు దక్కించుకొని పాఱిపోయి స్వదేశమును జేరినతోడనే సేనలనుగూర్చి కనిగిరిమీద దండెత్తివచ్చి వీరరుద్రునిరాజ్యమును, అతనిపుత్రికయైన చిన్నాదేవినిగై కొని, ద్రోహియైన యాతని జంపక కుటుంబసహితముగా వింధ్యపర్వత ప్రాంతములకు బాఱద్రోలెను. వీరరుద్రునిశుద్ధాంతస్త్రీలు వింధ్యపర్వతముపాలైన సంగతిని మనుచరిత్రమునం దల్లసాని పెద్దన యీరీతిగా వర్ణించి యున్నాడు:-

మ. ధరకెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతి న్వింధ్యగ

హ్వరము ల్దూఱగ జూచి తా రచట గాపై యుండుటం జాల న

చ్చెరువై యెఱ్ఱనివింతచీకటులు వచ్చెం జూడరేయంచు వే

పొరిదింజూతురు వీరరుద్రగజరాట్ఛుద్ధాంతముగ్థాంగనల్.