పుట:AndhraKavulaCharitamuVol2.pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

26. ఎఱ్ఱన

ఈకవి కొక్కోకమును, సకలనీతికథానిధానమును తెనుగున బద్యకావ్యములగా రచియించెను. కొక్కోకమునకు రతిరహస్యమని నామాంతరము. దీని కవిత్వము హృద్యముగానేయున్నను నీతిమంతులు చదువ దగినగ్రంథముకాదు. ఈగ్రంథము కుంటముక్కల మల్లయామాత్యుల కంకితము చేయబడినది. శైలిని జూపుటకయి కొక్కోకములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను-


చ. పెనిమిటిభాగ్యరేఖ గుణబృందము లేనరు లైన ముందటన్

వినుతులు చేయ సౌఖ్య మొదవించును నాథునియందు మిత్రులం

గనుగొని సంతసిల్లు గలకంఠిగుణంబులుచూడ జూచి చ

య్యన దెలియంగవచ్చు మదనాంకురభావము జూడకుండినన్. [ఆ.1]


చ. తరుణులు పుష్పకోమలులు తత్తఱపాటున నేమిచేసినన్

విరసము పుట్టు గావున వివేకమునం బురుషుండు తత్సఖీ

పరచితభంగి రాగరసబంధురుడై యెట నేప్రయోజనం

బురమణి కిష్టమౌనదియె పూర్వముగా గెడబాటుచేయుచున్. [ఆ.2]


ఈకవి యుండిన కాలమువిషయమై మన మిప్పుడు కొంచెము విచారింపవలసి యున్నది. కవి కృతిపతియగు భైరవమల్లామాత్యుని వర్ణించుచు-


సీ. హరిపదధ్యానతత్పరుడు చండలమహాలక్ష్మీప్రసాదై కలబ్ధవరుడు

రహి గజపతిమహారాయ లిచ్చినసమంచితమహాపాత్రప్రసిద్ధయశుడు

నాజమాఖానరాయనిచేతనొడయుడై వినుకొండదుర్గ మేలినఘనుండు

కృతివననిక్షేపపృథుతటాకాలయతనయాదిసప్తసంతానఘనుడు