పుట:AndhraKavulaCharitamuVol2.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

వసుచరిత్రాదికావ్యప్రీతబహునృపప్రాపితానేకరత్నప్లవుండ

శాశ్వతశ్రీవేంకటేశ్వరానుగ్రహనిరుపాధికైశ్వర్యనిత్యయశుడ


శ్రీకరమహాప్రబంధాంక సింగరాజ

తిమ్మరాజ ప్రియతనూజ ధీరసూర

పాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి

నంకిత మొనర్తు నీకావ్య మనఘభక్తి- [హరిశ్చంద్రనలో పాఖ్యానము]


మ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం

దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారసుధారాశి సం

జనితై కై కదినప్రబంధఘటికాసద్యశ్శత గ్రంథక

ల్పను సంగీతకళారహస్యనిధి బిల్వంబంచి పల్కెం గృపన్- [వసుచరిత్ర]


పయిపద్యములలో నుపయోగింపబడిన విశేషణములు కొన్ని భిన్నములుగా నున్నను పరస్పర విరుద్ధము లయిన వేవియు లేనందున వానినిబట్టి గ్రంథకర్తలు భిన్నులని సాధించుట కాధార మేదియు లేదు. రెండు గ్రంథములను జేసినవారాంజనేయ ప్రపాదలబ్ధ కవిత్వ వైభవులమని వ్రాసికొనుట చేతను, రెండు కవిత్వములు నేకరీతినే యుండుట చేతను, ఆదినుండియు నిప్పటివఱకును బట్టుమూర్తియే వసుచరిత్రము రచియించెనని జనశ్రుతి వచ్చుచుండుట చేతను, కవికి దరువాత నల్పకాలములోనే వసుచరిత్రమునకు వ్యాఖ్యానము చేసినవారు కొందఱు బట్టుమూర్తి తాను రచించిన నానారసభాసురమగు ప్రబంధమునందలి వివిధాలంకారములకు లక్షణగ్రంథముగ నుండునట్లు నరసభూపాలీయమను నలంకార గ్రంథమును రచియించెనని వ్రాసియుండుటచేత, తద్గ్రంథత్రయకర్త యొక్కడేయైయుండునేమో యని యెట్టివారికిని సందేహము కలుగక మానదు. ఇక పైపద్యములోని యంశములనుబట్టి విచారింపవలెను. నరసభూపాలీయ కృతికర్త పేరందలి గద్యమునుబట్టి