ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నొందుచుండగా

నారయ శాలివాహనశకాబ్దము లద్రియుగాబ్ధిసోములం

దారణవత్సరంబున నిదాఘదినంబున జ్యేష్ఠశుద్ద ష

ష్ఠీరవివాసరంబున నృసింహుని కృష్ణుడు చేరె స్వర్గమున్

ఈ పద్యమునుబట్టి శకాబ్దములు 1447 టికి సరియయినహూణశకము 1524 వ సంవత్సరమున గృష్ణరాయ లంతరించినట్లు కానబడుచున్నను, 1530 వ సంవత్సరమువఱకు నాతని దానశాసనములు విస్తారముగా నున్నందున శాసనములను బరీక్షించిన యిప్పటి వారతడు 1530 వ సంవత్సరమునందే మృతినొందెనని నిశ్చయించియున్నారు. 1526, 1528, 1529 వ సంవత్సరములయం దచ్యుతదేవరాయల దానశాసనములు సహితము రెండుమూడు కానవచ్చు చున్నను, అవి కృష్ణరాయల జీవితకాలములోనే చేయబడినవి కావచ్చును. కృష్ణదేవరాయలతండ్రియైన నరసింహరాయనికి తిప్పాంబ యనియు, నాగమాంబయనియు, ఇద్దఱు భార్యలు గలరు. ఆ యిరువురలో తిప్పాంబ పట్టపురాణియనియు, నాగమాంబ భోగకాంతయనియు, చెప్పుదురు. కొన్ని శాసనములయందు గూడ నిట్లే కానబడుచున్నది. ఆయిద్దఱు భార్యలలో తిప్పాంబకు వీరనృసింహరాయలును, నాగమాంబకు కృష్ణదేవరాయలును పుట్టిరి. నరసింహదేవరాయల కోబమాంబ యని యింకొక భార్య యున్నట్లును, ఆమె కచ్యుతదేవరాయలు పుత్రుడయినట్టును, శాలివాహనశకము 1459 వ సంవత్సరమునకు సరియైన హూణాబ్దము 1537 హేవిళంబి సంవత్సరమున చిత్తూరిమండలములోని నారాయణపురము నొక బ్రాహ్మణునికి దాన మిచ్చుచు నచ్యుతదేవరాయలు వ్రాసియిచ్చిన తామ్రశాసనములోని యీక్రింది వాక్యములవలన దెలియవచ్చుచున్నది:-