పుట:AndhraKavulaCharitamuVol2.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

త్సరమునందు మృతినొందెను. ఆకాలమునందు సదాశివదేవరాయడు పసివాడయినందున సకలము తిమ్మయ రాజ్యమును దానాక్రమించుకొని కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజును రామరాజు తమ్ముడయిన తిరుమలదేవరాయని బట్టి చెఱలో బెట్టవలెనని ప్రయత్నింపగా వారిద్దఱును పెనుగొండకు పాఱిపోయి యక్కడ గొంతసైన్యమును గూర్చుకొని తరువాత కందనూలురాజు మొదలయినవారి సాహాయ్యమును బొంది విజయనగరము మీదకి దండెత్తివచ్చి సలకము తిమ్మయ నోడించి చంపి 1542 వ సంవత్సరమునకు సరియైన శుభకృత్ సంవత్సర జ్యేష్ఠమాసమునందు బాలుడయిన సదాశివరాయని సింహాసన మెక్కించిరి. ఈ కార్యమువలన రామరాజు సదాశివరాజ్య సంస్థాపకుడని పేరుపొంది, పేరునకు సదాశివరాయడే రాజయినను నిజమైన యధికారమునంతను దానే వహించి రాజ్యపరిపాలనము చేయుచుండి 1564 వ సంవత్సరమునందు మహమ్మదీయ రాష్ట్రముల వారిసేనతో తాలికోటవద్ద జరగిన యుద్ధమునందు జంపబడెను. అప్పుడు మహమ్మదీయ ప్రభువులు విజయనగరమునందు బ్రవేశించి యనేక క్రూరకృత్యములను జరపి రాజ్యమంతయు పాడుచేసి తమలో దమకు సంభవించిన కలహమువలన రాజ్యమును పూర్ణముగా నాక్రమించుకొనక వెడలిపోయిరి. తరువాత నయిదు సంవత్సరముల వఱకు రాజ్య మించుమించుగా నరాజకము కాగా నీలోపల1567 వ సంవత్సరప్రాంతమున సదాశివరాయడు స్వర్గస్థు డయ్యెను. ఆసంవత్సరమునందే తిరుమలదేవరాయడు విజయనగరమును విడచి పెనుగొండజేరి తానురాజునని ప్రకటించి ప్రమోదూత సంవత్సరములో ననగా 1569 వ సంవత్సరమున పెనుగొండరాజ్యమునందు స్థిరపడి 1572 వ సంవత్సరమునందు లోకాంతరగతు డయ్యెను. 1572 వ సంవత్సరమునకు సరియైన ఆంగిరస సంవత్సర వైశాఖశుద్ధదశమినా డాతనిపుత్రు డయిన శ్రీరంగరాయలు