పుట:AndhraKavulaCharitamuVol2.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

19. పింగళి సూరనార్యుడు

పింగళిసూరన్న నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; గౌతమగోత్రుడు. ఈతనితాత సూరన్న; తండ్రి యమరన్న; తల్లి యబ్బమ్మ; అమలన్న, ఎర్రన్న తమ్ములు. విష్ణుపురాణమును రచియించిన వెన్నెలగంటి సూరన్న తరువాత నున్నందున, ఈతనిని పింగలి (వెనుకటి) సూరన్న యందురని యొకానొకరు చెప్పిరిగాని యది సరిగాదు. పింగలి యనునది ఈకవియొక్క గృహనామము. ఈతని పూర్వులును పింగలివారనియే చెప్పబడుచు వచ్చిరి. పింగలియనునది కృష్ణా మండలములోని యొకయూరు. కాబట్టి యీగ్రామనామమునుబట్టియే యీకవివంశమువారి కిటువంటిపేరు గలిగినది. ఈకవి ప్రభావతీప్రద్యుమునందు తనవంశమునకు మూలపురుషు డయిన గోంకనామాత్యుని వర్ణించుచు, ఆతనిని పింగళిపురాంకునిగా నీక్రిందిపద్యమునందు జెప్పియున్నాడు-


క. ఆగౌతమగోత్రంబున

సాగమనిధి పుట్టె గోంగ నామాత్యుడు స

ద్భోగక్షేత్రస్వామ్యస

మాగతి బింగళిపురాంకుడై యత డొప్పెన్.


ఈపింగళి గోంకనామాత్యుడే పేకియనుదానిని దాసినిగా నేలి నట్లీగ్రంథములోని యీక్రిందిపద్యమున జెప్పబడినది-


ఉ. పే ర్వెలయంగ నాఘనుడు పింగళలి గోంకబుథోత్తముండు గం

ధర్వ నొకర్తు బేకియనుదానిని దాసిగ నేలె యోగితా

గుర్వనుభావుడై నెఱపె గోపకుమారునిఖడ్గవర్ణనన్

బర్వపునిండునెన్నెలలపై నెఱిచూపెడుకీర్తిసంపదన్.