పుట:AndhraKavulaCharitamuVol2.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

థుని బూర్వకవినిగా స్తుతించియున్నాడు. కోనేరుకవియు విఠ్ఠలనాథుడును పదునాల్గవ శతాబ్దారంభముననే యుండినపక్షమున తరువాత నూఱుసంవత్సరములకు పయిగా పదునేనవశతాబ్దములో నున్న శ్రీనాథుని బూర్వకవినిగా పరిగణించుట సంభవించి యుండదుగదా ? కాబట్టి యీ కవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నా డనుటయే విశ్వసనీయము. ఈతనికవిత్వ మనర్గళధార గలిగి హృదయరంజకముగానే కానబడుచున్నది. ఇప్పుడు బాలభాగవతములోని రెండు పద్యములనుమాత్ర మిందుదాహరించుచున్నాను.


చ. కలియును రాజచిహ్నములు గ్రక్కున మాని భయోపతాపదు

ర్బలు డయి తత్పదాబ్జములపై నిజహస్తము చేర్చి, దేవ! నీ

లలితకృపాణపుత్రిక ధళద్ధళితం బగుచున్న యంతలో

జలమఱియున్ ఝళఝ్ఝళితసంగత మయ్యె మదీయచిత్తమున్. [ఆ.1]


ఉ. మాన్యుల మ మ్మెఱుంగ కవమానముచేతకు దుష్టజన్మతా

దైన్యము కల్గె మాకు ననుతాపము నొందకు డీర లింక నే

మన్యము నొల్ల మేమియును నచ్యుతు గ్రమ్మఱ జేరగల్గు సౌ

జన్య మనుగ్రహింపు డని సారెకు బ్రార్థనసేయ నత్తఱిన్. [ఆ.2]


                             _______