పుట:AndhraKavulaCharitamuVol2.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

దీనినిబట్టి చూడగా నితడు రామరాజు పెదతండ్రి కుమారు డగుటచేత రామరాజుకంటె పెద్దవా డయినట్టును, సామంత రాజయిన యీ తిమ్మరాజు ముందుగా మృతుడగుటచేత నాతని కుమారు డయిన తిరుమలరాజు రామరాజుకంటె పదిసంవత్సరములు ముందుగానే రాజ్యమునకు వచ్చినట్టును, ఊహింపదగియున్నది. అందుచేత నీ తిరుమలరాజు క్రీస్తుశకము 1520 వ సంవత్సరము మొదలుకొని 1551 వఱకును రాజ్యముచేసినట్టు రూఢీగా చెప్పవచ్చును. కాబట్టి దోసూరి కోనేరునాథ కవియు పదునాఱవ శతాబ్దముయొక్క పూర్వార్థమునందే యుండి, తిరుమలరాజుయొక్క రాజ్యారంభదశలోనే బాలభాగవతమును రచియించి యుండును. బాలభాగవతము తిరుమలరాజుయొక్క ప్రేరణచేతనే రచియింపబడినను, అది తిరుమలరాజున కంకితము చేయబడక యాతని ప్రార్థనమీద మృతు డయిన యాతనితండ్రి తిమ్మరాజున కంకితము చేయబడినది. తెలుగు పుస్తకములయందును తామ్రశాసనాదుల యందును తిమ్మరాజునకు తిరుమలరాజనియు, తిరుమలరాజునకు తిమ్మరాజనియు యథేఛ్ఛముగా పర్యాయపదములవలె వాడబడినవి. సంస్కృత పండితులయిన హూణవిద్వాంసు లొకరు రాచూరికోటలో నొక గుమ్మమునకు దక్షిణముగా గోడలో గూర్చిన సుమారు నలువదియొక్క యడుగుల పొడుగును మూడడుగుల వెడల్పును గల రాతిపలకమీద చెక్కిన తెలుగు శాసనములో:


"శ్రీమతు మీసరగండగొఱ్ఱె గంగయ్యరెడ్డివారు పెద్దమానపురము

నందు సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము చేయుచుండగాను

తద్రాజ్య రక్షామణి అయిన శ్రీనారాయణదేవ దివ్యశ్రీపాదపద్మా

రాధక సకలజన ప్రతిపాలక పరబలసాధక సకలదయాసాధక పుణ్య

గుణసనాథ విఠ్ఠలనాథ భూనాథుండు ఆదావాని తుంబికి మాగుద

హాలువదుర్గాలు సాధించి తదనంతరంబు రాచూరి పట్టణ పట్టిసాభి