ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర గుహాలయాలు

భైరవకోన

ప్రాచీన కాలమునుండి హిందూ దేవాలయాల నిర్మాణానికి, పూజా ప్రతిమల రూపణకు వస్తువును ఎన్నుకొనుటలో ఒక ప్రత్యేకత అగుపడును. ఇది ప్రకృతి పరమైన ఆచారము మరియు కొని చిహ్నముల ఆధారముగా మన దేశమున జరుగు చుండెను. దీనిలో కొయ్య మొదట వాడబడినది. ఈ నాటికీ కొన్ని ప్రాంతాలలో దేవతా ప్రతిమల రూపణకు, సనాతనుల గృహోపకరణములకు, సన్యాసుల అవసరాలనేకములకు ఇది వాడబడుట మనము గమనించ వచ్చును. కొయ్య తరువాత ఈ నిర్మాణాలకు ఇటుక, సున్నము లేక మట్టి, కొయ్యతోబాటు వాడుట ప్రారంభమయ్యెను. కానీ వీటి వాడుక వచ్చినప్పటి నుండి ఈ నిర్మాణాలు అపుడపుడు బాగు చేయ వలసి వచ్చుటే గాక కొయ్య ప్రతిమలు పాతబడుటచే వాటి స్థానమున కొత్తవి స్థాపించ వలసి వచ్చెను. ఇట్టి సాంప్రదాయము ఈ నాటికి మనకు ఒరిస్సాలోని పూరి జగన్నాథ దేవాలయములో అగుపడును. ఇచటి దేవ గృహం అనగా గర్భ గృహము లోని కృష్ణ, బలభద్ర, సుభద్ర ప్రతిమలు శిల్ప శాస్త్ర ప్రకారము ప్రతి పన్నేండేళ్ళకు (Jupiter's siderial period with reference to the sun)మార్చ బడును (renewed ritually). తమిళ ప్రాంతమున కూడ కాంచీపురము దగ్గరలోని ఉత్తిరమేరూర్ లోని పల్లవుల సుందర వరద దేవాలయమందు కూడ కొయ్య ప్రతిమ వాడకము ఈ నాటికీ యున్నది. ( ఈ దేవాలయమందే క్రీ.శ. 914 లోనే ఓటు పద్దతిలో ఎన్నికలు జరిగెడి విధానమును తెలిపెడి ఒక శాసనము చోళ రాజైన ఒకటవ పరాంతకునికి చెందినది గలదు). శాస్త్ర సిద్ధాంతాల ప్రకారము కొయ్య లేక స్టక్కోతో చేయ బడిన దేవతా ప్రతిమ వున్న దేవాలయము కూడ ఇటుక, సున్నము లేక మట్టి లతోనే నిర్మింపబడవలెను. ఇట్టి దేవాలయాలు పునర్నిర్మాణము జరిగి శిలతో నిర్మింప బడినచో ఇందలి దేవతా ప్రతిమ కూడా శిలతో రూపొందింపబడు చుండెను. ఇట్టి ఉదాహరణలలో కాంచీ పుర మందలి వరద రాజ స్వామి దేవాలయము ముఖ్యమైనది. ఈ దేవాలయము మొదట ఇటుకతో నిర్మింప బడినది. కాని క్రీ.శ. 13 వ శతాబ్దమున శిలతో పునర్నిర్మింప బడినది. ఇందలి కొయ్య ప్రతిమ భద్ర పరచబడినది. ఈ కొయ్య ప్రతిమనే అత్తివరద అందురు. ఇది ప్రతి పన్నెండేళ్ళ కొక సారి ఒక ప్రత్యేక ఉత్సవ కాలమున బయల్పరచ బడును. స్టక్కో ప్రతిమలకు కూడ అపుడపుడు 'పునుగు చట్టం' అను సున్నము మొదలగు వాటితో రూపొందింపబడిన పదార్థముతో శాస్త్ర ప్రకారము పూత వేయబడును.

ఇటుక, సున్నము, మట్టి, కొయ్యతో రూపొందింపబడిన నిర్మాణములతో బాటు దేవాలయానికి శాశ్వితత్వమును, నిర్మాతకు గౌరవము గలిగించెడి పెద్ద ఏక శిలా ఖండములలో గుహల రూపమున గాని (Cut in or scooped). ఆలయ రూపమున గాని (cut-out or monolithic) ఆలయాలను రూపొందించుట ప్రారంభమయ్యెను. అనేక రాజ వంశాలు అనేక కాలలలో వీటిని రూపొందించినవి. ఇవి పల్లవులు, పాండ్యులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, యాదవులు, విజయనగర రాజులు, నాయక వంశ రాజులచే మహాబలిపురము, కళుగుమలై, బాదామి, ఎల్లోరా, పన్హలె - కాజి, ధమ్నేర్, దౌలతా బాద్ మొదలగు ప్రాంతాలలో దాదాపు క్రీ.శ. 16 శతాబ్దము వరకు నిర్మించుట సాగెను.