పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/399

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనఘ యాధ్యాత్మికంబును నాధిభౌతి, కంబు నాధిదైవికమునాఁ గలుగునట్టి
వ్యధలు తాపత్రయంబులై యఖిలజంతు, వుల మహాదుఃఖములఁ బెట్టి యలఁపుచుండు.

354


క.

శారీరమానసములన, నారయ నిరుదెఱఁగులందు నాధ్యాత్మిక మా
శారీరము రోగములు మ, హారోషక్రోధమదము లగుమానసముల్.[1]

355


క.

ఇలఁబరులవలనఁ బ్రాణికిఁ, గలదుఃఖము లాధిభౌతికములన వాత
జ్వలనాదులపీడలనొ, ప్పలవడియుండుటయె యాధిభౌతికమయ్యెన్.[2]

356

దేహధారికిఁ గలుగుగర్భజన్మజరాదిక్లేశములవివరణము

వ.

ఇట్టి తాపత్రయంబు శరీరికి గర్భజన్మజరాజ్ఞానమృత్యునారకసంభవంబు లైన
యనేకభేదంబుల నత్యంతదుఃఖంబు లాపాదించు నెట్లనిన.[3]

357


సీ.

కోమలదేహంబుతో మలమధ్యంబునందు మావినిఁ బుట్టి యధికభుగ్న
మున నురమును బృష్ఠమును గూడి కంఠంబు కడుపులోన నడంగి కరచరణము
లంగంబుతోఁ గూడి యరఁటిపూవునుబోలె ముడిఁగి మూత్రములోన ముద్దగట్టి
తీక్ష్ణోష్ణతువరామ్లతిక్తామ్లములు తల్లి భుజియింపఁ దద్దుఃఖములకు నోర్చి


తే.

మేనఁ బ్రాణంబు గలిగియు మెలఁగరాక, వర్ధిలుచును బ్రజాపతి వాతనిహతి
చేతఁ దలక్రిందుగాఁబడ సూతిమారు, తమునఁ ద్రెళ్లింప మూర్ఛిల్లి ధరణిఁ ద్రెళ్లు.[4]

358


తే.

బాహ్యవాయువు సోఁకి విభ్రష్టమైన, యెఱుకతో దేహమంతయు నిఱచఁబట్టి
క్రకచములఁ గోసినట్టులఁ గంటకముల, నూఁదిన ట్లవయవంబులు నొచ్చుచుండు.[5]

359


ఆ.

ఒడలు గోఁకికొనఁగ నొదికిలఁ బవళింప, శక్తిలేక పెక్కుసంకటములఁ
బొంది స్నానపానభోజనోపాయంబు, లకు స్వతంత్రవృత్తి యొకటి లేక.

360


క.

ప్రువ్వులు నీఁగెలు దేహము, నొవ్వం గఱవంగ మిగుల నొచ్చి యధముఁడై
యివ్విధమున దుఃఖము లెడ, త్రెవ్వక వర్తించు జన్మదివసమునందున్.[6]

361


తే.

ఆధిభౌతికతాపంబులందుఁ గంది, సంతతంబును నజ్ఞానసంవృతాత్ముఁ

  1. శారీరమాసనములు = శరీరసంబంధులు మనస్సంబంధులు నైనవి.
  2. వాతజ్వలనాదులు = వాయువు ఉష్ణము మొదలగువానివలని, నొప్పలపడు = బాధకలుగు.
  3. ఆపాదించున్ = కలిగించును.
  4. కోమల = లేఁతయైన, భుగ్నమునన్ = వంగరచేత, తీక్ష్ణ = కారము, ఉష్ణ = వేఁడియైన, తువర = వగరు, ఆమ్ల = పులుసు, తిక్తామ్ల = చేఁదుతోడిపులుసు, (ఇవిగలవస్తువులను,) వాతనిహతిచేతన్ = గాలిదెబ్బచేత, సూరిమారుతమునఁ ద్రెళ్లింపన్ = ప్రసూతివాయువుచేత పడఁద్రోయఁగా.
  5. విభ్రష్టము = మిక్కిలి చెడినది, ఇఱచఁబట్టి = చలిచే మొద్దుపాఱి, క్రకచములన్ = ఱంపములచేత, కంటకములన్ = ముండ్లచేత, ఊఁదినట్లు = పొడిచినట్లు.
  6. ప్రువ్వులు = పురుగులు, ఎడత్రెవ్వక = ఎడతెగక.