పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఏమఱిపాటువోయి దనుజేంద్రునితో నతిఘోరమైనసం
గ్రామ మొనర్పఁ జొచ్చుటయు రాక్షసవీరునివేఁడియూర్పు లు
ద్దామవిషాగ్నికీలలవిధంబున నొక్కటఁ జుట్టుముట్టి నా
నాముఖవీరసేనల వినాశము చేసె భయంకరంబుగన్.[1]

97


వ.

అందు దృఢాశ్వచంద్రాశ్వకపిలాశ్వు లనుమువ్వురుకుమారులు దక్కఁ దక్కినకు
మారులందఱు భస్మీభూతులై రప్పుడు కువలయాశ్వుండు విష్ణుభక్తిప్రభావం
బునం జేసి యారక్కసు నుక్కడంచె నది కారణంబుగాఁ గువలయాశ్వుండు
దుందుమారుండయ్యె.[2]

98


క.

ఐశ్వర్యశాలి యైనదృ, ఢాశ్వుఁడు హర్యశ్వుఁ గాంచె నతనికి సురలో
కేశ్వరనిభుఁడు నికుంభుఁడు, శశ్వజ్జయశాలి పుట్టె సన్మునితిలకా.[3]

99


వ.

ఆనికుంభునకు నహితాశ్వుండును వానికిఁ గృతాశ్వుండును వానికిఁ బ్రసేన
జిత్తుండును వానికి యువనాశ్వుండును బుట్టి రయ్యువనాశ్వుండు మహాధర్మ
శీలుండై రాజ్యంబు చేసి సంతానంబు లేనిసంతాపంబున నిర్వేదించి యొక్కనాఁ
డాత్మగతంబున.[4]

100


ఉ.

ఏలితి లోకమున్ నిరవహిత్థవిభూతి వెలుంగ శత్రులం
దోలితి భూమిభృద్విపినదుర్గములన్ జరియింపఁ గీర్తులన్
వాలితి మూఁడులోకములవారలు మెచ్చఁగ నిట్టులయ్యు నా
కేలని తోచుచున్నయవి యిన్నియు సంతతి లేకయుండుటన్.[5]

101


ఉ.

ఎడ్డమి యైనయప్పటికి నెవ్వరుఁ జేరరు లోకు లేమియున్
సడ్డలుసేయ నొల్ల రవసానపువేళల దండధారుచే
జడ్డలె కాని మేలుకొనసాగదయో తలపోసిచూచినన్
బిడ్డలు లేనివాని కడవి మృగజన్మము రోఁత పుట్టదే.[6]

102


మ.

అని సర్వంబుఁ బరిత్యజించి నిజభృత్యామాత్యవర్గంబుల
దనరాజ్యం బరయంగ నిల్పి ప్రియకాంతాయుక్తుఁడై కానకుం
జని యత్యుగ్రతపంబు సేయునెడ నాసర్వంసహామండలా
వనకేళీరతుఁ డైనభూవిభునిసద్వంశంబు రక్షింపఁగన్.[7]

103
  1. ఏమఱిపాటు = అకస్మాత్తుగా, ఒక్కటన్ = ఏకాకారముగా.
  2. ఉక్కడంచెన్ = చంపెను.
  3. శశ్వజ్జయశాలి = ఎల్లప్పుడు గెలుపుచేత ఒప్పునట్టివాఁడు.
  4. నిర్వేదించి = దుఃఖించి, ఆత్మగతంబునన్ = మనసులో.
  5. నిరవహిత్థవిభూతి = కొఱఁత లేనియైశ్వర్యము, భూమిభృద్విపినదుర్గములన్ = కొండలయందలి యడవు లనెడు (నరులకు) ప్రవేశింపరాని కోటలయందు, వాలితిన్ = అతిశయించితిని - మించితిని.
  6. ఎడ్డమి = హీనదశ, సడ్డలు సేయనొల్లరు = లక్ష్యము చేయఁజాలరు, అవసానము = అంతము, జడ్డలె = నిర్బంధములే, మృగజన్మము = మృగజన్మమున కైనను అనుట.
  7. కానకున్ = అడవికి, సర్వంసహామండలావనకేళీనిరతుఁడు = భూమండలమును ఏలుట యనెడు క్రీడలయందు ఆసక్తుఁడు - వినోదముగా భూమి నేలువాఁడు.