పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

బమునందుఁ బలువురుకవు లుండియుందురు. మనకు అనపోతరెడ్డికాలమునాటి వెన్నలకంటి సూర్యుఁడు, ప్రకృతగ్రంథకర్తయగు సూరనార్యుఁడు, కృష్ణవిజయకర్తయగు వేంకటాచలకవి మాత్రమె పరిచితులు. ఇంక నీకుటుంబమున నెందఱు కవు లుండిరో యేగ్రంథములు రచించిరో యెఱుంగరాదు. జక్కనచే విక్రమార్కచరిత్రము అంకితముగాఁ గొన్న సిద్ధమంత్రి వెన్నెలకంటివంశజుఁడె. ఈయన కవియుఁ గవిపోషకుఁడును నై యున్నాడు. ఇంక నీకుటుంబములో నెందఱుకవు లుండియుండిరో! వెన్నెలకంటివారి యిండ్లలో నెంతయో తాళపత్రపుస్తకభాండారముగలదు. అది యేనాఁటికి శోధింపఁబడునో యెప్పటికి నూతనవిశేషములను గ్రహింపుగల్గుదుమో!

కృతిభర్తయగు రాఘవరెడ్డి అనవేమారెడ్డి వంశజుఁడని కవి స్పష్టముగాఁ జెప్పినాఁడు గాని వంశసంబంధము చెప్పలేదు. దౌహిత్రసంతతిలోనివాడో పౌత్రసంతతివాఁడో రాఘవరెడ్డిని గురుతింప వీలుగాకయున్నది. రాఘవరెడ్డికి నాతనిపూర్వులకుఁ జెప్పఁబడిన పల్లవాదిత్య, రాయవేశ్యాభుజంగ, చంచుమలచూరకార, హేమాద్రిదానచింతామణి మున్నగుబిరుదములు అనవేమాదులవే! రాఘవరెడ్డియు నతనిపూర్వులును రెడ్డిసామ్రాజ్యము ఆస్తమించినపిదప సామాన్యగృహస్థులుగా నుండి రాజసేవతోఁ గాలము గడిపిన భాషాభిమానులు. కృతిభర్తతండ్రి మఱలఁ గొంచెముగనో గొప్పగనో పూర్వగౌరవము నిలువఁబెట్టినాఁడు. ఇతఁడు సూరకవికి మొగళ్లూరను అగ్రహార మిచ్చినటులఁ జెప్పఁబడినది.

సూరనార్యుని కాలనిర్ణయమును గూర్చి చర్చ యింతతో ముగించి యతని కవితానైపుణ్యమునుగూర్చి యించుక ప్రసంగించుదము. ప్రబంధరచనమునకుఁ బెద్దనార్యుఁడు త్రోవదీసినదాది ఆంధ్రవాఙ్మయమున కొకనూతనపరివర్తన మేర్పడెను. తఱుచుగాఁ గవు లుపజ్ఞను గోలుపోయి వసుచరిత్రమునో మనుచరిత్రమునో దృక్పథమునం దుంచుకొని ప్రాఁతత్రోవలఁ బోవ మొదలిడిరి. సూరనార్యుఁ డీయుగసంధిలో నున్నవాఁడు. ఆదికవుల నిరుపమానధారాశుద్ధియుఁ బ్రబంధకవుల చిత్రకవితావిలాసము సూరనకవియెడఁ జూపట్టుట యొకవిశేషము. ఈతఁడు సంస్కృతసమాసజటిలముగను మిశ్రరీతిగను దేటతెనుంగుగను గవిత రచించుటలో మిగుల గడుసరి. మొత్తముమీఁద నీతనికవిత ద్రాక్షాపాకములో నలరి యాపాతరమణీయముగా నున్నది. తిక్కన, శ్రీనాథుఁడు, ప్రబంధపరమేశ్వరుఁడు కథాభాగములలోఁ జూపునుద్వేగము వర్ణనాంశములలోఁ జూపు భావసౌష్టవము ప్రకృతి