పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

కొండపల్లి, ఉదయగిరి గజపతుల స్వాధీనములో నుండెను. కృష్ణదేవరాయలే యీమూఁడుదుర్గములను జయించెను; గజపతులమన్ననలను బొందుటయుఁ గర్ణాటరాజులమన్ననలచే నుదయగిరిరాజ్యము బడయుటయు కృష్ణదేవరాయలకు బసవనృపతి సమకాలికుఁడు గాకున్నఁ బొసఁగదు. తరువాత అచ్యుతదేవరాయలకాలముననో రామరాజుకాలముననో కృతికర్తయగు రాఘవరెడ్డి సూరనకవియు నుండియుందురు. ఇందులకుఁ దగు నుపపత్తులను విచారింపవలసియున్నది.

వెన్నెలకంటి వెంకటాచలకవి శ్రీకృష్ణవిజయమను బ్రబంధము రచించుచు నందుఁ దనవంశజుఁడును బూర్వుఁడు నగు ప్రకృతసూరకవి నీవిధముగ స్తుతించెను.

సీ.

“సూరపకాంతిచే సూర్యప్రకాశుండు వేదాదివిద్యల వెలసినాఁడు
విష్ణుపురాణంబు వేడుకఁ దెనిఁగించి విమలయశంబున వెలసినాఁడు
రావూరిబసవన్న రమణతో నిచ్చిన యలమొగుళ్ళూరగ్రహార మందె
వెలుగోటి తిమ్మభూవిభునిచేఁ గొనియె దా నాందోళికాచ్ఛత్ర మగుపదవిని


తే.

కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు, ననెడు పౌరుషనామధేయంబు నిలిపె
సరసగుణములు గలిగిన సాధుసుకవి, మాననీయండు సూరనామాత్యవరుఁడు."

ఈసూరనార్యునకు వెంకటాచలకవి ఆఱవపురుషుఁడు. సూరనార్యునికుమారుఁడు లక్ష్మన్న. అతనికొడుకు చక్రప్ప. వానికొడుకు గంగయ్య. వానికొడుకు సూరపరాజు. అతని కొడుకు జగ్గన్న. జగ్గన్న కుమారుఁడు వెంకటాచలకవి. వెంకటాచలకవి తనపితామహునకుఁ బితామహుఁ డని విష్ణుపురాణకర్తను జెప్పి యతనినుండి వరుసగా వంశవృక్షము నొసంగినాఁడు. తనపితామహునివలన వెంకటాచలకవి ఆతనిపితామహుఁడగు నీసూరనకవి పుట్టుపూర్వోత్తరములు వినియుండును. సూరనార్యునియెడఁ జెప్పినవిశేషములు విశ్వాసపాత్రము లనుటలో సంశయింపఁ బనియుండదు. ఈపద్యసహాయమునఁ గవికాల మిఁక స్పష్టపడును. సూరనార్యునకు అందలము గొడుగు ఇచ్చి మన్నించిన వెలుగోటి తిమ్మనృపాలుఁ డెవఁడో శోధింపవలసియున్నది. గురుజాడ రామమూర్తిగారు, రేచెర్ల అనపోతనాయకుని కుమారుఁడగు తిమ్మనాయనినే వెలుగోటి తిమ్మభూపతి యని చెప్పి సూయలు చెప్పినటుల నితనికాలము క్రీ. శ. 1360 కాదనియు 1300 అనియు జెప్పిరి. ఈనిర్ణయము సర్వవిధములఁ బ్రమాదభూయిష్ఠమైనది.

రేచెర్లగోత్రీయులగు వెలమవీరులు ప్రతాపరుద్రదేవుని కాలమువఱకు గాకతీయులకడ సేనానాయకులుగ నుండిరి. ప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1328