ఈ పుట ఆమోదించబడ్డది

16 ఆంధ్రభాషార్ణవము[శబ్దాది నాట్య

శబ్దాదివర్గము

సీ.

మ్రోఁత నాదు రవళి మ్రోఁగుడు వాఁగుడు స ద్దులి వలికిడి చప్పు డలుకు
డనఁగ శబ్దం బొప్పు నతిదారుణధ్వని ఱం పన ఱం తన ఱంపి యనఁగఁ
గ్రం దన విలసిల్లు గలకలధ్వని దోఁచు నలబలం బన హళాహళి యనంగ
గొల్లన గొల కన గె ల్లన రొద యనఁ దనరు దిముకునా మృదంగరవము
వెలయు నార్తారవంబు గీపెట్టు నాఁగఁ గంఠనినదాఖ్య యెలుఁగునాఁగను జెలంగు
నదియ సూక్ష్మతరంబుగానైనఁ బరఁగు నీరెలుం గటం చనఁగ బాలేందుమౌళి.

121


సీ.

ఆర్తకంఠరవాఖ్య యలరు నేడు పనంగ వెలయు ఖేదధ్వని ములుగు నాఁగ
గగ్గునా వెలయు గద్గదిక డగ్గుత్తిక యనఁగ గద్గదకంఠ మలరుచుండుఁ
దత్సాధుకృద్ధ్వని దనరును గ్రేటన ఱంకెనా వృషభవిరావ మొప్పు
నఱపు నాఁగఁ బశుకంఠారవంబు చెలంగు శునకారవము మొఱు గనఁ దనర్చు
నూళ యన జంబుకధ్వని యొప్పు నీల యనఁగఁ దస్కరసంకేతనినద మెసగు
జలవిహృతికాలశబ్దంబు వెలయు నోల యనఁ బ్రతిధ్వని మఱుమ్రోఁత యనఁదగు భవ.

122


తే.

పాట యనఁగను గానాఖ్య పరఁగుచుండు, నాలతి యనంగ నాలప్తి యలరుచుండుఁ
దద్విశేషాభిధానముల్ దనరు నేల, జోల సువ్వాల యనఁగను సోమభూష.

123


క.

చరచర యన బిరబిర యన, జరజర యన నిట్లు కొన్నిశబ్డానుకృతుల్
పరఁగుచు నుండును జగతిని, స్ఫురితగుణావేశ మాతృభూతమహేశా.

124


తే.

శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగుచుండును శబ్దాదివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

125

నాట్యవర్గము

సీ.

వీణె వీణియ యన వీణాఖ్య రాజిల్లు వాయింపు నా దన వాదన మగుఁ
గొడుపునా విలసిల్లుఁ గోణాభిధానమై యొళవు నాఁగఁ బ్రవాళ మొప్పుచుండుఁ
గలివెయం చనఁగను గకుభంబు విలసిల్లుఁ దంతి యనంగను దంత్రి వెలయు
నలరును గుబ్బకాయ యన నలాబువు బవిసిన మనఁగఁ దద్బంధన మగుఁ
బరగు నుపవాహనామంబు బిరడ యనఁగ సారె మె ట్లన సోపానసంజ్ఞ దనరు
మేరు వనఁగను విలసిల్లు మేరుసంజ్ఞ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

126


సీ.

దండె దండియ యన దండవాద్యం బొప్పు దంబురా యనఁగను దుంబుర దగు
డక్క డక్కి యనంగ ఢక్క విరాజిల్లు నావజం బననొప్పు నావజంబు