ఈ పుట ఆమోదించబడ్డది

xx


నామతమునకు వ్యతిరేకముగా నేలచెప్పును? చెప్పినపుడు చింతామణిమతము ఖండించి త్రోసివ్రేయఁడా? అది యొకమార్గమని యొప్పుకొన్నచోఁ బక్షాంతరముగాఁ జెప్పఁడా? అట్లు చెప్పుట వ్యాకరణకర్తల సంప్రదాయము. మనకేతన పాణినీయకౌమారవ్యాకరణాదులసంప్రదాయ మెఱిఁగినవాఁడేగదా. ఆంధ్రశబ్దచింతామణి కేతనకవి చూడనే చూడలేదనుట యుక్తము.

మరియొకవిషయము పరిశీలించి ముగించెదను.

క. "మల్లెయు లంజెయు గద్దెయు
   నొల్లెయు ననుపగిది పలుకులొప్పుగఁ గృతులన్
   మల్లియ లంజియ గద్దియ
   యొల్లియ యని పలికిరేని యొప్పుంగృతులన్." 177
                                     ఆంధ్రభాషాభూషణము.

ఎదంతరూపములకు ఇయాంతరూపము లుండవచ్చును అని కేతనభావము. చింతామణిలో "ఎదంత తాచనామ్నామియాంతానామ్" ఇయాంత రూపములకు ఎదంతరూపము గలుగవచ్చును అని గలదు. ఆంధ్రభాషాభూషణమున "ఎ" కి "ఇయ" చింతామణిలో "ఇయ" కు "ఏ" విధింపఁబడినది. రెండు నన్యోన్యప్రతికూలములు.