ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

అనంతామాత్యుఁడు

అనంతామాత్యుని చరిత్ర - విమర్శకులకు తెలిసినంతమట్టుకు - ఆంధ్రవిజ్ఞానసర్వస్వములోను, ఆంధ్రకవుల చరిత్రలోను ఉన్నది. చర్వితచర్వణముగా అందులోని విషయములనే మరియొకసారి చర్చించి వ్రాయడ మనవసరము; గనుక వాటిలోని సారాంశములను మాత్రము సంగ్రహించి తెలియజేయుచున్నాను.

అనంతుడు ఆరువేల నియోగి బ్రాహణుడు; కౌండిన్యగోత్రజుడు. ఇతనిముత్తాతయైన బయ్యన్నకు తిక్కనసోమయాజి "భవ్యభారవి” అన్న బిరుదిచ్చెనట. అనంతుడు రచించిన గ్రంథములు 1. భోజరాజీయము, 2. ఛందోదర్పణము, 3. రసార్ణవము. భోజరాజీయములో ఉన్న "సీ. విలసితంబగుకృష్ణవేణా,” అనే పద్యమును బట్టి అనంతుని "తండ్రియైన తిక్కన కృష్ణామండలములోని శ్రీకాకుళమున కొడయఁడైన యంధ్రవల్లభుని సేవ చేయుచుండె”ననిన్ని, రసార్ణవమందున్న “శా. జానొందన్‌ శకవర్షముల్” అనేపద్యము బట్టి ఇతడు క్రీ. శ. 1435. జనవరి తే 25 దికి రసార్ణవము రచియించి దేవాంకితము చేసినట్లు తెలియవచ్చుచున్నది గనుక, ఇతడు 15-వ శతాబ్దము నడుమ నున్న వాడనిన్ని నిస్సందేహముగా చెప్పవచ్చును.