ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాలవ్యోచ్చారణ పూర్వముఉండెను. గనుకనే కృష్ణుఁడు - కిత్తడయినది.[1] రానురాను ఋకారమునకు తాలవ్యోచ్చారణ మారి ఉత్వముతోకలిసిన రేఫోచ్చారణవచ్చినది. ఋౠలు రురూలని తెలుగువారు పలుకుచున్నారు. ఇది అనంతునినాటికే వచ్చినట్లు కనబడుచున్నది. స్రుక్కు రేఫయుతమే గాని 'సృక్కు 'అని ఋకారయుతము కాదని చెప్పినాడు. ఇటువంటిదే ఌవడి.

2. దంత్య ‘ౘౙస' లకు తాలవ్య 'చజశ'లకు మూర్ధన్య 'ష'కారమునకు మైత్రి ఎట్లు సావర్ణ్యమునుబట్టి కలిగినది? వీటిమైత్రికంటె 'సెలవు'లో 'సె'కున్ను 'శలభము'లో ఉన్న 'శ'కున్ను మైత్రి తెలుగువారి ఉచ్చారణబట్టి ఎక్కువగా ఉన్నట్లున్నది. ఇవి అన్నీ ఉష్మములు గనుక వాటికి మైత్రి కలదు అంటే, హకారము కూడా ఊష్మము, ఉపధ్మానీయజిహ్వామూలీయములు కూడా అట్టివే. అంతస్థములయిన “యరలవ”ల కేల మైత్రి లేదు?

3. లఘ్వలఘు యకారములకు తుల్యాస్యప్రయత్నము పూర్తిగాఉన్నదా? 'యామినీ' లోని 'య' 'వచ్చినయప్పుడు'లోని 'య' — ఈ రెండున్ను ఒక్కలాటివా?

4. నణలు భిన్నవర్గములు; అనునాసికత్వమే సామాన్యము; అంటే, తక్కినఅనునాసికలతో ఎందుకు మైత్రికూడదు? తత్సమ తద్భవములలో నణలు మారుచుండును. ఉ. గుణము; గొనము;

  1. ప్రాకృతభాషలలోను, పాలీలోను ఋకారము కొన్నియెడల ఇకారమయినది. అరవములో కృ=కిరు, తెలుగులోను, కన్నడములోను కృ=క్రి.