ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహువ్రీహి—

క.

ఏవస్తు వెవ్వనికిఁ గల
దావస్తువుకలిమి యతని కలవడఁ బలుకం
గావలయు బహువ్రీహి శి
రోవిలసద్బర్హిబర్హ రూఢవివేకా!

91

తత్పురుషము—

గీ.

ప్రథమపదమున కెద్ది విభక్తి దాని
చే విశేషింపఁబడినది యా విభక్తి
సంజ్ఞఁ బరఁగును దత్పురుషంబు కృతుల
నదియు నఞ్‌పూర్వసహిత మెన్మిదివిధములు.

92


క.

తగఁ బ్రథమాతత్పురుషం
బగుఁ గాయముయొక్క పూర్వమపరము దెల్లం
బుగఁ బూర్వకాయ మనఁగా
నగణితముగ నపరకాయ మనఁగా వరుసన్‌.

93


క.

కమలాశ్రితుండు ధనకృ
త్యము కుండలకాంచనంబు ధామాగతుఁ డ
ర్యమసుతుఁ డుపలస్థితచి
త్ర మన ద్వితీయాదు లాఱు తత్పురుషంబుల్‌.

94


క.

క్షితి నఞ్‌ తత్పురుషం బగుఁ
బ్రతిషేధనకారమునకుఁ బ్రతియై మొదలన్‌
వితతాకారము చొప్పడి
యతఁ డబ్రాహ్మణుఁ డనంగ నవృషలి యనఁగన్‌.

95