ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలచక్రంలో 25 సం||లు సాధారణ విషయం కావచ్చు, ఓ సంఘం విజయవంతంగా 25 సం||లు పయనం చేయడం అపురూపమైన, అమోఘమైన విషయం. అదే విధంగా కళాకారుల సంక్షేమ సంఘం వెండి పండుగ చేస్తున్న సమయంలో నాకు చేదోడు వాదోడుగా సహకరిస్తూ సలహాలిస్తూ, మా భుజంతట్టి మా సంఘాన్ని ముందుకు నడిపించడంలో "సవ్యసాచి" అనిపించుకున్నారు రమణ.

రమణగారితో కళాకరంగంలో అనేక కళారూప ప్రదర్శనలు చేయడం, అలాగే టి. వి. సీరియల్స్‌లో "వేంగీ వైభవం" "నఱ్ఱవాడ వెంగమాంబ"లో కలిసి నటించడం, అంతేగాక ఆయన స్వీయరచన స్కిట్స్ (లఘునాటిక)లో చేసి ప్రజల ప్రశంసలు అందుకోవడం ఒక అపురూపమైన సమయం. సంఘంలో ప్రతిభా పురస్కారాలు (సన్మాన పత్రాలు) వ్రాయడం ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు.

ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందటానికి ఈయన కృషి ముఖ్యం. ఒక వ్యక్తి ఒక్క రంగంలోనే అతని అదృష్టంకొద్ది రాణించడం జరుగుతుంది. అయితే రమణగారు విద్యారంగంలో, రచనా రంగంలో, కళారంగంలో, సేవారంగంలో రాణిస్తున్నారంటే అది ఆయన పూర్వజన్మ సుకృతం. అటువంటి సుకృతం ఉంటేగాని రాణించరు.

సినీ వినీలాకాశంలో తేజరిల్లుతున్న ప్రముఖ సినీనటులు బ్రహ్మానందం గారితో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగానే మా కళాకారుల సంక్షేమ సంఘంలో ఉన్న సభ్యుడు పొన్నాడ వీరబ్రహ్మంగారితో మాట్లాడతారుగాని బ్రహ్మానందం గొప్పవాడని, పొన్నాడ వీరబ్రహ్మంగారు సామాన్యుడని ఎంచిచూడక సమభావంతో సంభాషించే సమతామూర్తి రమణ.

రమణగారి వ్యక్తిత్వం, ప్రవర్తనలో నిబద్ధత, విషయాలలో ఆయనను చూసి కొన్ని నేను అలవర్చుకున్నాను.

  • వ్యాసకర్త రంగస్థల కళాకారుల సంక్షేమసంఘం, ప|| గో|| జిల్లా ప్రధాన కార్యదర్శిగా గూడెం మండలశాఖ అధ్యక్షునిగా కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. రంగస్థలంపై గాయకునిగా, నటునిగా ప్రసిద్ధిచెందిన వ్యక్తి. టి. వి. ధారావాహికల్లో నటించారు.