ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయనే మార్గదర్శి : - రమణ మాస్టారితో ఏ కొద్ది పరిచయం ఉన్న వ్యక్తైనా ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితుడు కాకుండా ఉండలేరు. ఇక గాఢమైన అనుబంధం ఉన్న కుటుంబసభ్యులు, మిత్రులు ఆయననే చాలా విషయాల్లో మార్గదర్శిగా తీసుకుంటారంటే ఆశ్చర్యం కాదు. నాతో చాలామంది అనేవారు - మీ గురువుగారు (రమణ మాష్టారు)ని అనుకరిస్తావు, అనుసరిస్తావు అందరి దగ్గరా మంచిపేరు తెచ్చుకుంటున్నావని. అది అక్షరసత్యం. నాతో వ్యక్తిగతంగా ఒకసారి ప్రముఖ అధ్యాపకుడు, కళాకారుడు సైమన్‌పాల్ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మంచిమాట చెప్పారు. "రమణగారు సరళంగా ఆలోచిస్తారు. తాను ఏది ధర్మం అని నమ్ముతారో దాన్నే ఆచరిస్తారు. ఏది ఆచరిస్తారో అదే ఎవరికైనా బోధిస్తారు" అని. ఐతే అరవై ఏళ్ళపాటు నిత్యం మనసు, మాట, చేత ఒకటి కావడం అంత సామాన్యమైన విషయం కాదుకదా. ఆయన ఏ పని అనుకున్నా రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఒక్కసారి నిర్ణయించుకున్నాకా ఆచరించడంలో పట్టుదల, కార్యదక్షతలతో సమయ పాలనతోనూ అనుకున్నది అనుకున్న సమయానికి చేస్తారు. ఏ పని చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు కానీ అన్ని పనుల్లోనూ స్కూలు పనులకు, పిల్లల అభివృద్ధికే ముందు స్థానం ఇస్తారు. మిగిలిన విషయాల్లో ఆయన ప్రతిభ చూసినవారే ఆశ్చర్యపోతే స్కూలు పనుల్లో ఆయన పట్టుదల, కలుపుకుపోయే తత్త్వం. కార్యదక్షత చూస్తే దానికి వందరెట్లు ఆశ్చర్యపోతారు.

ఎందరితో ఎన్ని రకాలుగా వ్యవహరించాల్సి వచ్చినా అజాత శత్రువుగా నిలిచారు. స్కూలు కోసం, పిల్లల కోసం ఎలాంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదిరించగలరు. కాలానికి కొన్ని విడిచిపెట్టేయాలనే విజ్ఞత కల మనిషి. కష్టంలోనే సుఖం వెతుక్కునే కష్టజీవి. కుటుంబాన్నీ, సమాజాన్నీ సమతుల్యం చేసుకున్న కుటుంబపెద్ద.

నాకు ఆదర్శమూర్తి, గురువు, ఆరాధ్యుడు అన్నీ తానే అనిపించిన వ్యక్తి ఈ ప్రకృతిలో ఆయన ఒక్కరే.

_________________________________________________________________________ వ్యాసకర్త లింగారాయుడుగూడెంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. వెంకటరమణతో 2000 సం. నుండి రమణతో పనిచేశారు. కళాకారునిగా స్వచ్చంద కార్యకర్తగా పేరుతెచ్చుకొంటున్న తిరుపతిరావు వాటి వెనుక రమణస్ఫూర్తి ఉన్నట్టు చెబుతూఉంటారు.