ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంగళాశాసనాలు

...త్రిభాషా మహా శతావధాని,

ప్రణవ పీఠాధిపతి

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్

ప్రణవ పీఠం, రామానగర్, ఏలూరు

పవిత్ర మనస్కుడు శ్రీ సూరంపూడి వేంకటరమణగారితో నాకు 1989 నుంచి పరిచయం ఉంది. మా అవధానాలలో పృచ్ఛకులుగా పాల్గొనడమేకాక, అవధానాలను అపూర్వ రీతిలో ప్రాచుర్యం పొందేలా వ్యాసాలు రచించి, అవధానానికి సత్కీర్తిని ప్రసాదించిన రమణీయ హృదయం శ్రీ రమణగారిది. ఈయన ఉపాధ్యాయుడు, నిరంతరాభ్యాస శీలి, సహృదయుడు. తన సొంత డబ్బుతో అవధానులను చాలామందిని ఎన్ని విధాలుగా సత్కరించినాడో నేనెఱుగుదును. కేవలం పృచ్ఛకునిగా పేరు పత్రికలలో రావడం తప్ప, ఎన్ని చేసినా తన పేరుని పత్రికలలో ప్రకటించుకోని అమాయక చక్రవర్తి. కవితాభిమానంతో, ఎన్ని పనులున్నా మానుకొని, కవి పండితుల కార్యక్రమాలన్నింటికీ వచ్చి, యధాశక్తి సత్కరించి వెళ్ళే మా రమణకు షష్టిపూర్తి అంటే ఆశ్చర్యం, ఆనందం. "కాలోహి దురితక్రమ." అన్నారు కదా! భవిష్యత్తులో శ్రీ రమణగారి "సహస్రచంద్ర దర్శనాని"కి నాకు పిలుపు వస్తుందనీ, అప్పుడుకూడా మా ముగ్గురమ్మలు కొలువై ఉన్న ప్రణవపీఠం నుండి మంగళాశాసనం అందించగలననీ నా నమ్మకం. శ్రీ రమణగార్కి సకల శుభాలు కలగాలని మంగళాశాసనాలు చేస్తున్నాను.

               శా|| సూరంపూడి కులాబ్జ భాస్కరుడు, సుశ్లోకుండు, విద్యారసా
                      కారుండున్, రమణాఖ్యు డార్యజన విఖ్యాతుండు, సన్మిత్రు డం
                      హోరాశి ప్రగతి ప్రచండుడును, సంధ్యోపాసనా ప్రీత చే
                      తో రమ్యుండగు వేంకట ప్రదితుడందున్ సంపదౌన్నత్యముల్