పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/282

ఈ పుట ఆమోదించబడ్డది

 “మాటలలో గోటలును గోడలును దాటు పోటు మానుసులు గూడ నుందురని నేటి కెరిగితిని.”

ఆ బాల చటుక్కున దిరిగి చిరునవ్వున పరిచారికలతో నాసందె చీకటులలో విసవిస నడచి మాయమైపోయినది.

20

శ్రీచాళుక్య విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనాపతియైన ఇంద్రదత్తునికి విక్రమ సింహపురమున సామంత పట్టాభిషేక మొనర్చి యప్రమత్తుడవై పల్లవుల గనిపెట్టి యుండుమని యానతిచ్చి, తన సైన్యమున నెక్కువభాగము నాతని పాలనమున నుంచి యుత్తరాభిముఖుడయ్యెను.

గిరిపశ్చిమరాష్ట్ర (కొండవీడు రాష్ట్రము) సామంతుడైన బుద్దవర్మ, విష్ణువర్ధను భగవంతునిగ నెంచి పూజించును. ఆతడు నాదెండ్లను తన రాజధానిగ జేసికొనెను. తన మహాప్రభువుత్తరాభిముఖుడై వచ్చుచున్నాడని తెలియగనే యెదురుగ బోయి కుబ్జ విష్ణువర్ధనుని సర్వసార్వభౌమ లాంఛనములతో దన రాజధానీ నగరమున కాహ్వానించెను.

“మహాప్రభూ! తాము రెండవ త్రివిక్రములు, తమ యానతి చొప్పున నీ రాష్ట్రముల, నీ సీమల శత్రుకంటక శూన్యముచేసి, మేఘములు లేని రాత్రివలె నొనర్చితిని. షోడశకళాపూర్ణ చంద్రులై పాండవవంశ కులతిలకులగు తామీ విశాలాంధ్ర మహా రాజ్యమునకు సామ్రాజ్యపట్టాభిషేక మొనరించుకొనవలసియున్న"దని మనవి చేసినాడు.

కుబ్జవిష్ణువర్ధనుని మోము కాంతివంతమై వెలిగిపోయినది.

“బుద్దవర్మప్రభూ! విక్రమసింహపురమున నింద్రదత్త ప్రభువు నివే మాటల ననినాడు. అన్నగారీ యీ రాజ్యములు దిగ్విజయము కొఱకు జయించినారు. వారి యానతి ననుసరించి మే మిచ్చట సామ్రాజ్యము స్థాపించెదమనుమాట నిశ్చయము.”

“మహాప్రభూ! అనుగ్రహింపబడితిని.”

“మన విజయము లన్నిటికిని సకలాంధ్రసామ్రాజ్యమును బరిపాలించు శ్రీశైల మల్లికార్జునదేవ వరప్రసాదమే కదా మూలకారణము!”

“చిత్తము మహాప్రభూ!”

“భ్రమరాంబికా ద్వితీయ మల్లికార్జునదేవునకు మనము సర్వపూజలు నొనరింప వలెను. కాని, యాపరమశివునకు మల్లికార్జున నామ మెట్లు వచ్చినదో!”

“అది యిచ్చట చరిత్రప్రసిద్దము మహాప్రభూ! మహా కోసల ప్రభువులైన సోమవంశీయులు తమ అన్నయ్యగారు పృధ్వీవల్లభసార్వభౌములకు గప్పము గట్టిరిగదా!”

“అవును”

“ఆ కప్పము గట్టినది సోమవంశ చంద్రగుప్తుని కొమరుడైన హరగుప్త మహారాజు, చంద్రగుప్త మహారాజు కొమరిత చంద్రావతి. ఆ దేవి పుట్టిననాట నుండియు మహాశివుని భక్తురాలై, యోగినీవేషము ధరించి, సర్వకాలములయందు శివపంచాక్షరి జపించుకొనుచు లౌకిక ప్రపంచము మలచి యుండెడిదట.”

అడివి బాపిరాజు రచనలు - 6 • 274 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)