పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంతలో గోదావరి ఈవలావల గట్టుమీద వేలకువేలు ఆశ్వికులు పదాతులు తోచినారు. “పడవలు ఆపండి! ఏడీ చంద్రశ్రీ!” అన్న ఉరుములాంటి మాటలు వినబడ్డాయి. బాలికలంతా ఘొల్లుమన్నారు. ఆ సాయంకాలపు చిరు చీకట్లలో అనేకమంది బాలికలు కాగడాలుపట్టి ఉన్నవాళ్ళు “అమ్మయ్యో” అని కేకలు వేసి కాగడాలు నీళ్ళల్లో పారవేశారు. బాలలు కొందరు గజగజలాడుతూ అలా నిలుచుండిపోయినారు. తెడ్లువేసే బాలికలు తెడ్లువేయడం మానివేశారు. పడవలు నడిపే చుక్కాని బాలికలు మూర్చపోయారు. చుక్కానులు వదిలారు. లేదా భయంతో చుక్కానులు తమ ఇష్టం వచ్చినట్లు తిప్పినారు.

పడవలు ఒకదానికొకటి తగులుకున్నాయి. కొందరు బాలికలు పట్టుతప్పి నీళ్ళల్లో పడ్డారు. కొన్ని పడవలు జరిగిపోవడంవల్ల కొందరు బాలలు నీళ్ళుల్లో పడ్డారు. కొందరు ఉరకాలని నదిలో ఉరికినారు. గోలగోల నీళ్ళలోపడ్డవారు ఈదలేనివారు మునుకలు వేస్తున్నారు. వీళ్ళను రక్షించడానికి గట్టుమీదవారు ఏనుగులను దింపినారు. ఏనుగులు అనేకమంది బాలికలను తొండాలతో రక్షించి అందిస్తున్నాయి. ఈత వచ్చిన వీరభటులు, సేనాపతులు నీళ్లలోనికి ఉరికినారు. ఆశ్వికులు తమ అశ్వాల్ని ఉరికించినారు.

ఆ గడబిడ అంతా చల్లారి బాలికలను రక్షించడం, పడవలను ఒడ్డుకు పట్టించడం అంతా అయ్యేసరికి మూడుగడియలు పట్టింది. నలుగురు బాలికలు దొరకలేదు. దొరికినవారిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తక్కిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. కాని యువరాజు చంద్రశ్రీ జాడ ఎక్కడా కనుపించలేదు. వెంటనే పులమావి దిట్టరులైన అపసర్పులను, సేనాధికారులను గోదావరి తీరాన్నే పంపినాడు.

తెల్లవారి ఆంధ్రశాతవాహన చక్రవర్తులూ, యువరాజులూ కొలువుతీరే మహాసభలో పులమావి శాతవాహనుడు మహాసింహాసనంపై అధివసించి, తన మంత్రులు, చంద్రశ్రీ మంత్రులు, తన సేనాపతులు, కొందరు చంద్రశ్రీ సేనాపతులు, బౌద్ధభిక్కులు, పండితులు కొలిచి ఉండగా తన మంత్రిని చూచి, “ఏమయ్యాడు చందశ్రీ ?” అని అడిగినాడు.

“అన్నదాతా! మహాచక్రవర్తీ! చంద్రశ్రీ నిన్న సాయంకాలం గడబిడ ప్రారంభించగానే నీటిలోనికి ఉరికి తన అంగరక్షకురాండ్రయిన నలువురు దిట్టలైన స్త్రీలతో చల్లగా ఈదుకుంటూ, వారి నౌకాబలంతో కూడా వచ్చే చిన్న పడవ ఎక్కి తేలుకునిపోయాడట. అలా మూడుగోరుతాలు ప్రయాణంచేసి, గోదావరితీరంలో ఉన్న ఒక గ్రామంలో దిగి ఏనుగులపై ఎక్కి వెళ్ళిపోయాడట” అని మంత్రి మనవి చేసినాడు. .

“అలాగా, చంద్రశ్రీ ఏనుగులమీద ఎక్కడికి పోయినాడో అది కనుక్కోడానికీ, ఆ దారిలో దొరికితే బందీచేసి పట్టుకురావడానికి చారులను పంపలేదా మీరు?” చిరాకు నాట్యంచేసే మోముతో ప్రశ్నించినాడు పులమావి.

“చిత్తం! అన్నదాతా! ఆ ఏనుగు ఎటువైపు వెళ్ళిందో తెలియలేదట. ఇంకా చారులు కొంతమంది వేగంగల ఏనుగుల పైన వెదుకుతున్నారు” సవినయంగా మంత్రి విన్నవించుకొన్నాడు,

చంద్రశ్రీ ధనాగారం పరిశీలిస్తే పూర్వంనుంచీ ఉన్న బంగారు ఆభరణాలు నవరత్నాలుపొదిగిన ఆభరణాలు చాలా ఉన్నాయి. ఫణాలరాసులు చాలా తక్కువ ఉన్నాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

125

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)