పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశంలో నేతనేసే ప్రదేశాలలో కొన్ని పూంగీప్రోలు చూట్టూ ఉన్నాయి. సన్ననినూలు, ముతకనూలు, అతిసన్ననినూలు, గ్రామాదులలో ఒడికి అమ్ముతారు. ఆ నూలు అంతా ప్రోగుచేసి దేవసాలీసంఘంవారు కొంటారు. వారే ఆ నూలుకు రంగులు అద్దించేవారు. నేతవారు చిత్ర చిత్ర నేతలతో వస్త్రాలు విన్యాసం చేస్తారు. వణిక్సంఘంవారు ఆ వస్త్రాలను కొంటారు. అప్పుడని ఎగుమతి అవుతూ ఉంటాయి.

బ్రహ్మదత్తప్రభువు ఇవన్నీ పూంగీప్రోలు పట్టణంలో పరిశీలించారు ఎన్ని చూచినా బ్రహ్మదత్తప్రభువునకు ఏమీ తోచడం లేదు. నిర్మల మయిన మనస్సూ, నిశ్చలమయిన హృదయమూ కలిగిన బ్రహ్మదత్తుడు ఏమి తోచక సంతతమూ తిరగడము ఇవిచూచీ, అవిచూచీ కాలక్షేపం చేయడం ప్రారంభించినారు. ఒకసారి ఆయన ఓడయెక్కి సముద్ర విహారం చేసినాడు. ఇదే ఆయనకు మొదటిసారి సముద్రయానం చేయడం.

బ్రహ్మదత్తుడు ఎక్కిన చిన్నఓడ నాలుగు తెరచాపలు ఎత్తుకొని రివ్వు రివ్వున వెళ్ళిపోతున్నది. కెరటాలు సముద్రదేవుని ఉబికే పక్షంలా ఉన్నాయి. ఆ కెరటాలను చీల్చుకొంటూ రివ్వురివ్వున తేలిపోతూ ముందుకు వంగి, పైకి తేలుతూ నాట్యంచేస్తూ ఆ నౌక ప్రయాణం చేస్తున్నది. ఐదారు యోజనాలు అలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నదా తరణి. బ్రహ్మదత్తప్రభువు ఓడ ముందు భాగంలో నావికుని ప్రక్కనే నిలుచుండి ఆ ఓడ సౌందర్యము, ఉబికే తరంగాలలోని నీలిలోతులు, ఎగిరే చేపలు, పోతవాహకు కేకలు, సముద్రంపై తేలిపోయే పక్షులు, నౌప్రాక్దండము నీళ్ళును చీల్చుకొనిపోయే విచిత్రములన్నీ చూస్తూ నిలబడినాడు. ఓడ కొంతదూరం సాగగానే బ్రహ్మదత్తప్రభువుకు కొంచెం తలతిరిగి, వికారం పుట్టి డోకు వెళ్ళిపోయింది. కాని తన సర్వశక్తులు కేంద్రీకరించుకుని, ఆ వికారాన్ని అణచుకొన్నాడు.

రెండుజాములు గడచినవెనక తరణిలోవచ్చిన వంటబ్రాహ్మణుడు సిద్ధంచేసిన భోజనమారగించి, కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. ప్రొద్దు పడమటికి మళ్ళి జాముకాగానే బ్రహ్మదత్తప్రభువు నౌకోపరిభాగానికి విచ్చేసెను. నావికానాయకుడు ప్రభువునకు నమస్కరించి “ప్రభు, ఓడను తూర్పునుండి ఉత్తరానికి మళ్ళించినాము. ఘడియకు గోరుతవేగంతో వెడుతున్నది. అందుకు కారణం గాలి పడిపోవడమే ప్రభూ!” అని మనవి చేసినాడు.

5

బ్రహ్మదత్తునకు పడవ వెనక్కుతిప్పు అనడానికి బుద్ధిపుట్టలేదు. ఏమవునో అవుగాక! వరుణదేవుడే తన హృదయంలోని ఆవేదన తీర్చుగాక అనుకొనినాడు. తీరానికి ఆరుయోజనాల దూరాన ఓడ ఉత్తరాభి ముఖమై పోతున్నది. ఓడలో పది పదినాల వరకు మంచినీరు, భోజన సామాగ్రీ ఉన్నది. ఒకదినము గడిచిపోయినది. ఓడనాయకుడు మరునాడుదయం బ్రహ్మదత్తప్రభువును కలిసికొని “ప్రభూ! మనము కాకుళానికి ఎదురుగుండా ఉన్నాము” అని మనవి చేసెను.

“ఓడను పోనియ్యవయ్యా! గోదావరి ముఖద్వారంవరకు వెళ్ళి తిరిగి వద్దాము.”

అడివి బాపిరాజు రచనలు - 6

98

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)