ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనవాణి

తెలుగు సంవత్సరాలు

మనం ఇప్పుడు తెలుగునాట వాడుతున్న సం॥ల పేర్లు 60. ఇది ఒక చక్రము. ఈ 60 సం॥ల చక్రము ఎప్పటి నుండి వాడుకలో ఉంది? ముందు నుండి ఇదేనా? మరో చక్రమేదైనా వాడుకలో వుందా?

ఒకప్పుడు థాయ్‌లాండు, దిగువ బర్మా, లావోస్‌ ప్రాంతాలను తెలాంగ్‌ (తైలంగ్‌) జాతీయులు పాలించారు. వీరి ఆధునిక పేరు మూన్‌. వీరు మన ఆంధ్రతీర ప్రాంతము నుండి వెళ్లినట్లుగా వారి జోల పాటలలో వున్నాయి. ఇంతేకాక వారు తమ లిపిని తెలుగు - కన్నడ లిపిని ఆధారం చేసుకొని రూపొందించినట్లు చెప్పుకుంటారు.

బర్మా రాజుల చేతిలో ఓడిపోయిన తరువాత వారి భాష, సంస్కృతులు నాశనం చేయబడి రాజ్యాలను వదిలి అడవుల పాలయ్యారు. గత 50 సం॥లుగా వారు తిరిగి తమ చరిత్రను, భాష - సంస్కృతులను నిలుపుకోవడానికి పరిశోధనలు చేస్తూ, వాటికి గ్రంథరూపమిస్తున్నారు. అవి అన్నీ బర్మా భాషలో ఉన్నాయి.

అలాంటి ఒక పుస్తకంలో ఓ చోట మృగశిర సం॥ము, జ్యేష్ట సం॥ము అని కన్పించాయి.

థాయ్‌లాండులోని లాన్‌ఫూన్‌ (హరిపుంజయ) నగరంలోని బౌద్ధదేవాలయములలో మూన్‌ భాషలో 7 రాతి శాసనాలు దొరికాయి. వాటి రాతలలో సం॥లను అంకెలలో కాకుండా పేర్లతో వ్రాయడం కన్పించింది. వుత్‌డూన్‌ దేవాలయంలో కన్పించిన సవ్వాది సిద్ది (సర్వాది సిద్ధి) రాజుగారి దాన శాసనంలో ... రాజుగారి వయస్సు 26 సం॥లు నిండినప్పుడు (క్రీ.పూ 1219 - 1220) మార్గశిర సం॥ము, జ్యేష్ఠమాసం, శుక్లపక్షమి 5వ రోజు ఆదివారమనియు, రాజుగారి వయస్సు 32సం॥లు నిండి నప్పుడు... జ్యేష్ట సం॥ము, జ్యేష్టమాసం, బహుళ పక్షమి, 13వ రోజు, మంగళవారం...అని వుంది.

బర్మాదేశం, ప్యీ నగరం, శ్వేసండో రాతి శాసనంలో శకరాజ్‌ 455, మృగశిర సం॥ము, శ్రావణ మాసం, శుక్రవారం, ఉత్తర ఫల్గుణి నక్షత్ర, కన్యలగ్న మనియు, దిగువ బర్మా, తటోన్‌ నగరంలోని... చైటే శాసనంలో...శకరాజ్‌ 460, వైశాఖ సం॥ము, వొశాఖ నెల, శుక్రవారం, హంస నక్షత్ర...అని వుంది.

పై అంశాలు గమనించినవ్చుడు పూర్వం మన వాళ్ళు నెలల పేర్లతో 12 సం॥ల చక్రాన్ని వాడినట్లుగా తెలుస్తున్నది. ఈ విషయాన్ని పెద్దలు శివనాగిరెడ్డిగారు, జయధీర్‌ తిరుమలరావు గార్లతో ప్రస్తావించగా... అలాంటి శాసనాలు ఇక్కడ కన్పించలేదన్నారు. సం.వెం. రమేష్‌ గారు మటుకు రాష్ట్ర కూటుల పాలనా కాలంలో అలాంటి లెక్కింపు ఉండవచ్చునని అన్నారు.

- యర్రా (బర్మా) నాయుడు, విశాఖపట్నం 900582436

భాషలేకపోతే సాహిత్యమన్నదే ఉండదు

మంచిపనికి మొదట్లో మనుషులు తక్కువే వుంటారు. మొక్కల్ని తొక్కినట్టు తొక్కేస్తారు కూడా. ఆ మొక్క ఎలాగో పెద్దదై నాలుగు కాయలు కాస్తుండేసరికి, నేను నీళ్లు పోశాను, కంప వేశాను, పశువుల్ని హెచ్చరించాను, అంటూ అందరూ వస్తారు. లోకంలో జరిగే సాధారణ విషయం యిది. అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే (కొందరికి తెలిసి వుండవచ్చు), మానవుడు ఏ గడ్డమీద పుడితే, ఆ గడ్డమీద వేల సంవత్సరాలుగా వస్తూన్న నాగరికతా సంస్కృతులకు, భాషలకు నిర్వివాద వారసుడిగా వుంటాడు. కుటుంబ విలువలు, చదువులు, మరియు భాషా సాహిత్యాలే అతడికి ఆ నాగరికతా వారసత్వాన్ని అందిస్తాయి. సొంతగడ్డ సంస్కృతి అంటూ ఏదీ లేకుండా విశ్వమానవుడిగా అమాంతంగా ఎవడూ పుట్టెయ్యడు. నాగరికతను అందించే భాషా సాహిత్యాల్లో కూడా భాష అతి ముఖ్యమైనది. పిండి అంటూ వుంటేనే ఏ రొట్టె అయినా చేసుకోవచ్చు. జుత్తు అనేది వుంటేనే ఏ జడైనా వేసుకోవచ్చు. భాష అన్నది లేకపోతే సాహిత్యమన్నదే వుండదు.

భాష అన్నది లేకపోతే, ఎవరు నువ్వు, ఏమిటీ నీ చరిత్ర? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేక, తెలియక ఆత్మన్యూనతకి గురి కావలసి వస్తుంది. ఏ యితర భాషలో చదివినా, బ్రతికినా వాళ్ల వారసత్వాలు మనవిగా వుండవు. వాళ్ళ వారసత్వమే మనది అంటే తంతారు కూడా.

భాషనీ, సంస్కృతినీ పోగొట్టుకోవడం వల్ల, ఆధిక్యభాషల వాళ్ళక్రింద, మన ఉనికినీ, అస్థిత్వాన్నీ, తుదకు ఆత్మ గౌరవాన్నీ కూడా తాకట్టు పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. ఇంగ్లీషు చదివితే వచ్చే, ఉద్యోగాలన్నీ వాళ్ళ ప్రయోజనాలు కాపాడే బానిస ఉద్యోగాలే తప్పితే, దేశాన్ని బాగుచేసే వుద్యోగాలు కావన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ విషమ పరిస్థితో, యుద్ధ పరిస్థితో వస్తే లక్షలాది వుద్యోగాలు పోయి యువతరం వీధిన పడుతుంది. మేధావులు యిప్పుడిప్పుడే అది గుర్తిస్తున్నారు. ఇవన్నీ మన భాష, మన చరిత్ర, మన సాహిత్యం... వీటిని పోగొట్టుకున్నదాని పర్యవసానాలే.

భాష అంటే అది కేవలం మాట్లాడుకునే పదాల సమూహం కాదు. భాష అంటే అది మన అస్థిత్వం. మన ఉనికి మన ఆత్మగౌరవం. భాషని పోగొట్టుకోవడం అంటే, మన అస్థిత్వాన్నీ, ఆత్మ గౌరవాన్నీ తాకట్టుపెట్టుకుని, “నేను బాంచెన్‌ నీ కాళ్లకు మొక్త' అనడమే. మనకున్న మానవ హక్ములన్నీ కాలరాచి వేనుకోవడమే. మనకు ఆత్మ ప్రాణంలాంటి భాషని కాపాడుకోలేకపోతే, మనం గుర్రాలకూ గాడిదలకీ పుట్టిన శెంకుముత్తి గుర్రాల్లాగా తయారై, పాశ్చాత్య పేకేజీ చెత్తని మోసుకు తిరిగే బానిసలమై పోతాం. ఆత్మ గౌరవంతో బ్రతుకుదాం అంటున్న అమ్మనుడి ఛత్రం క్రిందికి అందరూ రావాలని ఆశ, ప్రార్ధన.

- డి.నటరాజ్‌, విశాఖపట్టణం

9440428597

6

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై 2018