ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొమర్రాజువారు రాజకీయాల్లో బాలగంగాధర తిలక్‌ అభిమాని. రావుగారు స్వయంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు. అయితే స్వాతంత్రోద్యమానికి సహాయ సహకారాలందించారు. 1906లో కలకత్తాలో దాదాబాయి నౌరోజి అధ్యక్షతన సంపూర్ణ స్వాతంత్ర్య నినాదంతో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో నాయని వేంకట రంగరావు హరిసర్వోత్తమరావులతోపాటు తాను కూడా పాల్గొన్నారు. 1907లో నందిగామలో జరిగిన కృష్ణాజిల్లా కాంగైస్‌ మహాసభలో లాలాలజపతిరాయ్‌ మొదలైనవారిని అరెస్టు చేయటాన్ని ఖండిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఇదే సంవత్సరంలో దేశం అంతా పర్యటిస్తూ బిపిన్‌ చంద్ర పాలుకు స్వాగతమిచ్చిన వారిలో రావుగారు కూడా వున్నారు. 1908లో మద్రాసులో జరిగిన శివాజీ వర్ధంతి సభలో పాల్గొని రావుగారు మరాఠీ భాషలో ప్రసంగించారు.

గిడుగు, గురజాడ, కందుకూరి నడిపిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని లక్ష్మణరావుగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కారణంగా ఎంతోమంది వ్యావహారిక భాషావాదులతో ఆనాడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

తెలుగులో చరిత్ర, వైజ్ఞానిక గ్రంథాలులేని కొరతను తీర్చడానికి కంకణం కట్టుకున్న ఏకైక మహావిజ్ఞాని రావుగారు. విజ్ఞానాన్ని సమాజానికి అందించడంకోసం అనేక గ్రంథాల్ని ప్రచురించిన మహనీయులు లక్ష్మణరావుగారు. ఆయన ప్రతిభకు నిదర్శనంగా “కొమర్రాజు వేంకటలక్ష్మణరావు విజ్ఞానసర్వస్వ పీఠం”ను తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. వీరు రాసిన భాషా వ్యాసాలు 'తెలుగు భాషాతత్త్వం” గా వెలుగులోకి వచ్చింది.

తక్కిన వారితో పోల్చిచూసుకుంటే లక్ష్మణరావు గారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు చాలా స్పష్టంగా కన్పిస్తాయి. ఇతరులు స్పృశించని అనేక రంగాల్లో వీరు విశేషమైన కృషిచేశారు. విద్య, వైజ్ఞానిక శాస్త్ర వ్యాప్తి చరిత్ర, పరిశోధన అంశాల్లో రావుగారికి ప్రముఖ స్థానం వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొమర్రాజువారు ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగుప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న లక్ష్మణరావుగారు ఉబ్బసవ్యాధి కారణంగా 46 సంవత్సరాల వయస్సులోనే అంటే 1923 జూలై13 తేదిన పరమపదించారు. తక్కువ కాలం జీవించినా, తెలుగు సాహిత్యంలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు కొమర్రాజువారు.

“అనేక విషయాల్లో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ప్రథము డనవచ్చు. దక్షిణ భారతీయ భాషల్లో విజ్ఞాననర్వస్వ నిర్మాణ ప్రచురణల విషయంలో తెలుగుకు ప్రాధాన్యం సంపాదించిన వాడాయనే. స్వభాషలో న్వదేశ చరిత్రను రాసిన వారిలో యావద్దక్షిణ భారతంలో ఆయనే మొదటివాడు. గ్రంథాలయ స్థాపనలో శాసనాల సేకరణలో, ప్రచురణల్లో, మౌలిక సమాచారం మీద ఆధారపడి చరిత్ర పరిశోధన చేయటంలో, ఒక శాస్త్రీయ పద్ధతి వ్రకారం ప్రాచీన గ్రంథ పరిష్కరణ చేయడంలో, శాస్త్ర సాహిత్యపరికల్పినలో, పరిభాషా కల్పనలో, పాఠ్యగ్రంథ రచనలో, తెలుగువారి కాయన మార్గదర్శకుడు. ప్రాచీన లిపి శాస్త్రాన్ని తెలుగు వారికి నేర్పిన వాడాయనే ఆయన చిరస్మరణీయుడు”

- డా॥బూదరాజు రాధాకృష్ణ


స్పందన

పిట్టచూపు సరిగ్గా వుంది

జూన్‌ 2018 అమ్మనుడి సంచికలో పిట్టచూపు శీర్షికలో శ్రీ చలసాని నరేంద్ర విశ్లేషణ సమంజసంగా వుంది. రాష్ట్ర విభజనను ఏకపక్షంగా, ప్రజల మనోభావాలను తెలిసికోకుండా చేసినారని నాలుగేళ్లు గడిచినా ఇంకా నాయకులు అంటూనే ఉన్నారు అనీ ఇంకా ప్రజలను నాయకులు తప్పుదారి పట్టిస్తూనే ఉన్నారనీ రాశారు. ఈ విషయంపై మనం కొంత వెనక్కి వెళితే నాయకుల తీరు స్పష్టంగా తెలుస్తుంది.

1952లో పొట్టి శ్రీరాములుగారు ఆత్మార్పణం చేసినా, మద్రాస్‌ నగరం లేకుండానే, మరియు, బళ్లారి, కోలార్‌, హోసూరు, యానాం, తిరుత్తణి, గంజాం, బరంపురం, పర్లాకిమిడి పట్టణాలను కలుపుకోకుండా ఆదరాబాదరాగా అప్పటి మన నాయకులు ఆంధ్రరాష్ట్రం యేర్చాటైతే చాలు అని, మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడానికి ఒప్పుకున్నారు. 1766 నుండి 1953 వరకు అనగా (187) సంవత్సరాలు కలిసి ఉండి, విడిపోయేటప్పుడు ఆస్తులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ పంపకం చెయ్యాలని, తమవాటాను తమకు ఇవ్వాలని మద్రాసు, కేంద్ర ప్రభుత్వాలను అడుగలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వేరుగా ఉంచుతూ 2014లో కేంద్రం నిర్ణయించినప్పుడు మాత్రం, ఆంధ్ర ప్రాంతం నాయకులు తమ వాటా జనాభా దామాషా ప్రకారం (58) శాతం పంచి యివ్వాలని అడిగి తీసుకున్నారు.

ఒక తెలుగురాజు మద్రాస్‌ ప్రాంతాన్ని (చెన్నపట్నం) ఆంగ్లేయులకు యిచ్చినాడు. అయినా మద్రాసు నగరాన్ని అడుగలేదు. వాటా గూడా అడుగలేదు - తమ తోటి తెలుగు వారైన తెలంగాణ వారి నుండి మాత్రం, వాటా తీసుకున్నారు! ఇదేమి న్యాయం - అక్కడొక న్యాయం, ఇక్కడ మరొక న్యాయమా?

రాయలసీమ నాయకుల ఒత్తిడికి తలొగ్గి కోస్తాంధ్ర నాయకులు కర్నూలును రాజధానిగా (1953)లో ఒప్పుకున్నారు - 1953లోనే విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని యేర్పాటు చేస్తే అనుకూలంగా ఉండేది.

ఆంధ్ర నాయకులు నాలుగేండ్లు గడిచినా ఇంకా విభజన గురించి తప్పుగా మాట్లాడడం ప్రజలను మభ్య పెట్టడానికే. పాడిందే పాటరా అన్నట్టు అదే పాట పాడుతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయ, ఖనిజ సంపద మరియు సహజ వాయువు, సుదీర్ఘ కోస్తాతీరం, తెలివిగల కష్టపడేరైతులు ఉన్నారు. మంచి వ్యాపార దక్షతగల పెద్దలున్నారు. విద్యారంగంలో గూడా చాలా ప్రతిభావంతులు ఉన్నారు. నదులనీరు, డెల్టాప్రాంతం ఉన్నది. ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం, దేశంలోనే అత్యధిక సంపదగల రాష్ట్రం అవుతుంది.

శ్రీ చలసాని నరేంద్ర వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వాస్తవాలను అంగీకరించడంలో నామోషి అక్కరలేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రంతో పోరాడి సాధించుకోవాలి. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకుంటుంటే ప్రజల ముందు పలచనై పోతారు. కలిసికట్టుగా కేంద్రంతో పోరాడి మన హక్కులను, వనరులను సాధించుకోవాలి.

- కంచర్ల సత్యపాల్‌రెడ్డి 86864 86859

స్పందన : 41 పుట కూడా చూడండి.

34

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018