ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లిటీని తెలుసకోరు. అన్నీ జనరలైజ్‌ చేసి జనం మీద పడి ఏడుస్తారు” అన్నాడు. నాకు కడువు రగిలిపోయింది.

“ఇప్పుడు నువ్‌ మాట్లాడేభాషే చూసుకో. మనం ఎంతగా ఇంగ్లీషులో కూరుకుపోయామో తెలుస్తుంది”

“ఏం ఫర్వాలేదు. మీరు ఉద్ధరించేదేం లేదు. వఠ్ఠి అరుపులే”

పెద్దవాడు. నేను అంతకంటే ఆయనతో వాదన పెట్టుకోలేను. ఆగిపోయాను. కాఫీలు వచ్చినై.

కాఫీ తాగి కదిలాడు పురుషోత్తం. ఆయనవెళ్ళిన తర్వాత శారద, నేనూ 'రియాల్టీ షో'లలో తెలుగు ఇంగ్లీష్‌ గురించీ, ఇంగ్లీష్‌ తెలుగు గురించిన చర్చలో పడ్డాము.

ఉన్నట్టుండి మధ్యలో ఆమె “ఉండండి నా 'సంగీతం' కార్యక్రమం వస్తుందివాళ” అంటూ టీవీలో ఛానెల్‌ని మార్చి, సర్ఫుకుని కూచుంది.

అప్పటికే 'పాట పాడనా... ' కార్యక్రమం మొదలైంది.

పాడుతున్న పదేళ్ళపిల్ల చూడముచ్చటగా ఉంది. ఆడంబరమైన ఆభరణాల్లో మెరిసి పోతోంది. పేరు వేశారు. పద్మజ. కెమేరా కార్యక్రమ నిర్వాహకుని పైకి మరలింది. ఆయన చాలా పేరున్న సినీ సంగీత దర్శకుడు. ఆయన పక్కగా రంగనాథం! ఆనాటి అతిథి!

ఆశ్చర్యపోయాను. రంగనాథం సంగీత నిధి కనుక ఇక్కడికీ ఆహ్వానించారన్నమాట!

“మీ మిత్రులు ఇక్కడా ఉన్నారు” అని నవ్వింది శారద.

పాట పూర్తయింది. శ్రోతలంతా లేచి కరతాళ ధ్వనులు చేశారు. అంత బాగా పాడింది - పద్మజ. నిర్వాహకుడు చాలాసేపు ఆమెని మెచ్చుకున్నాడు.

రంగనాథం నవ్వుతూ “సంగీతం నేర్చుకుంటున్నావు కదూ?” అని, చక్కని గాత్రం. బాగా సాధన చెయ్యి” అంటూ “క్షీరసాగర మధనం...” అను” అన్నాడు.

పద్మజకి వత్తులు పలకలేదు. “మధురం” అను- అని అడిగాడు. ఇక్కడా వత్తు రాలేదు.

“తెలుగుభాషకి నిజంగా వత్తులు తక్కువ. మనం సంస్కృతమయమై పోయాం. లేకపోతే ఆంగ్లమయం” అని ఆ పదాల స్వరూపాన్నీ ఉచ్చారణనీ విశదీకరించాడు.

ఆ తర్వాత పాడిన పిల్లల్లోనూ, అక్కడక్కడా ఇలా గోచరించిన ఉచ్చారణ దోషాల్నీ, భాషాపరమైన అవస్థల్నీ సరిచేస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించాడు-రంగనాథం.

గంటపైగా సాగి ముగిసింది. మేమూ రాత్రి ఉపాహారానికి లేచాము.

  • * *

రెండు నెలల తర్వాత - ఒకరోజు, నేను ఉదయపు నడకనుంచీ తిరిగొచ్చి కూర్చున్న సమయంలో వచ్చాడు రంగనాథం.

చాలా ఆశ్చర్యపోయాను. ఇదే ఆయన మాఇంటికి మొదటిసారి రావటం. వెతుక్కుంటూ వచ్చాడట.

- కాఫీ తాగడం పూర్తయింది.

అప్పుడు మొదలెట్టాడు రంగనాథం, “నేను కొన్ని టీవీ ప్రోగ్రాములకి అతిథిగా వెళ్ళాను. మీకు తెలుసో తెలీదో?”

“ఒకటిరెండు చూశాను”

“వాటి అనుభవంతో నేను మానసికంగా బాగా దెబ్బతిన్నాను మాష్టారూ?” అని క్షణం ఆగి, “తెలుగుభాష చెడిపోతున్నదనీ, ప్రభుత్వం వారు ఏమీ చేయటం లేదనీ, అధికారులూ, ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ ఉదాసీనతతో పట్టించుకోవడం లేదనీ అందరూ ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని కౌన్ని సంస్థలు కొంత నిర్మాణాత్మక కార్యక్రమాలకీ పూనుకున్నారు”

“అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది"

“నిజం. అందుకని నా వంతుగా నేనొక ప్రయత్నాన్ని మొదలెట్టాను”.

ఏమిటన్నట్టు చూశాను. శారద వచ్చి వో పక్కగా నిలబడింది.

“తెలుగు నేర్పటానికి ఉచిత సేవా కార్యక్రమం అది. స్థలం దొరికింది. విద్యాలయం వాళ్ళు శనిఆదివారాలు పెట్టుకోమన్నారు. టీవీల్లో పని చేసేవారూ, పని చేద్దామనుకునేవారూ, కళాకారులూ, నృజన కారులూ, సంగీతం నేర్చుకుంటన్న పిల్లలూ, ఇతర యువతీ యువకులూ...ఏ వయస్సు వారైనా సరే అర్హులే. శని ఆదివారాల్లో ఉదయం పదినుండి పన్నెండువరకూ - తెలుగు అభ్యాసం. చదవటం రాయటం.”

“బాగుంది.మంచి ప్రయత్నం” నేనూ శారదా ఇద్దరమూ అన్నాము.

“దీని కోసం మీ వంటివారి సహకారం తీసుకుంటున్నాను. ఒక గంటలో వివిధ గ్రూపులవారికి ఏమేమి నేర్పాలో - ఒక సిలబస్‌ వంటిది తయారుచేశాము - నేనూ మరో నలుగురం కలిసి”.

క్షణాల తర్వాత అడిగేడు, “మీ సహకారం కావాలి. ఒక గ్రూపుని మీరు చూసుకుంటే మాకు సహాయం చేసిన వారవుతారు”

“తప్పకుండా” అన్నాన్నేను. “నేనూ వచ్చి చూస్తాను” అన్నది శారద.

“స్వయంగా చూస్తే, అవసరాన్ని బట్టీ, అభ్యర్థల్ని బట్టీ మనం మన బోధన విషయాల్నీ విధానాల్నీ కూడా నిర్ణయించుకోవచ్చు, మార్చుకోవచ్చు” అంటూ చాలా కాగితాల్నీ వారు తయారు చేసిన చిన్న చిన్న పుస్తకాల్నీ చూపాడు.

“చాలా బాగుంది అంటూ ఆనందించాము.

రంగనాథం శలవు తీసుకున్నాడు.

  • * *

ఆ తర్వాతి శని, ఆదివారాలు నేనూ, శారదా రంగనాథం చెప్పిన విద్యాలయంకి వెళ్ళాము.

చక్కటి, చల్లటి వాతావరణం. ఏదో ఉత్సవం జరుగుతున్నట్టున్నది. వందమంది దాకా బాలబాలికలు. యువతీయువకులు, నడివయస్సువారు, పిన్నలతో వచ్చిన పెద్దలు!

విద్యాలయంలో ఒకటి రెండు అంతస్థులు వీరికిచ్చారు. మొత్తం నాలుగు గ్రూపులుగా క్లాసులు జరుగుతున్నాయి.

నావరకూ నాకయితే మనస్సూ- శరీరమూ కూడా ఆహ్లాదంతో తేలిపోతున్నట్లుంది.

“వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌/ గట్టీ మేల్‌ తలపెట్టవోయ్‌!” గురజాడ గేయం నా చెవుల్లో మార్ర్మోగుతుంది.

“ఈయన అమాయకుడిలా ఉన్నాడు గానీ, అసాధ్యుడే” అన్నది శారద.

“అవును. ఒక ఆశయానికి అంకితమైన ప్రతి మహనీయుడూ అసాధ్యుడే మరి" అన్నా న్నేను.

పిల్లలూ, పెద్దలూ బిలబిలమంటూ వెళ్తున్నారు. !!

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

23