ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాంకరమ్మ 'ఇప్పుడు మన జడ్జెస్‌ ఏమంటారో విందాం' అని వారివైపు చూసింది. 'శ్రుతకీర్తి మేమ్‌' అన్నది - మీ అభిప్రాయం ఏమిటన్నట్టు.

శ్రుతకీర్తి - టీమ్‌ని నానా విధాలుగా మెచ్చుకుని మార్కులకార్డు చూపింది. పదికి పది!

ఇప్పుడు చంద్రభాగ మేమ్‌.

చంద్రభాగ - ఒకటి రెండు సూచన లిచ్చింది. 'ఓవరాల్‌గా సూపర్బ్‌' అంటూ కార్డ్‌ చూపింది. తొమ్మిది!

“సార్‌ రంగనాథం గారూ? అన్నది యాంకర్‌.

పెద్దాయన వంతు వచ్చింది. చిత్రంగా నవ్వాడు. స్వయంప్రభ వైపు చూస్తూ 'బాగా చేశావమ్మా' అన్నాడు.

చప్పట్లు మరీ ఎక్కువ మోగినై.

'కానీ... నీ డ్రెస్‌ నీకు సహకరించినట్లు లేదు' అన్నాడు.

ఈలలు ఎక్కువైనై.

ఆ యువతి తనను తాను ఆపాదమస్తకం చూసుకుంది.

ఈలోగా శ్రుతకీర్తి 'ఫర్వాలేదులే మాష్టారూ' అంటే అట్టాంటివి మనం పట్టించుకుని కామెంట్‌ చేయకూడదు సారూ” అని దీర్ఘం తీసింది చంద్రభాగ!

“అలాగా” అన్నట్లు తల పక్కకి తిప్పి, “నీ పేరేమిటమ్మా!” అని ఇంకో యువతిని అడిగాడు రంగనాథం.

“దవలండి” చెప్పిందామె.

అర్ధం కాలేదు. పక్కకి చూశాడు. వాళ్ళకీ అర్ధం కాలేదు. పెదవి విరిచారు. “ఇంటిపేరా?” అంటే కాదన్నది ఆమె.

ప్రేక్షకుల్లోంచి ఎవరో అరిచారు “ధవళ” అండీ అని! అవునన్నట్లు తల ఊపింది ఆమె.

“ఓహో!” అని “దాని అర్ధం తెలుసా అమ్మా?” అని అడిగేడు.

“తెలీదండి” అని కొంచెం విసుగుదల చూపిందామె.

యాంకర్‌ కలుగచేసుకుంది. “మాష్టారూ మార్కులు” అని గద్దించింది.

ఆయన నవ్వాడు. ధవళవైపు చూశాడు. “ఇట్టాగైతే ఎట్టాగమ్మా!” అని “దాని అర్ధం స్వచ్చమైనది, తెల్లనిది అని” అన్నాడు.

“అఁహాఁ" అని దీర్ఘం తీసి సిగ్గుపడింది. ధవళ

రంగనాథం రంజిత్‌వైపు చూస్తూ “మీ వేగం చొరవా చాలా బాగున్నాయి” అని మెచ్చు కున్నారు.

రంజిత్‌ ఛాతీ నాలుగంగుళాలు పెరిగింది. చేతిలో మైక్‌ని పెదవుల దగ్గరపెట్టుకుని, సగం వంకరలు తిరిగి, వంగి వంగి, “థాంక్యూ సోమచ్‌సార్‌” అన్నాడు.

హాలు మళ్ళీ స్పందించింది!

“అవునూ- మీరు పాడిన పాట నాకు సరిగా తెలీలేదు. ఒకసారి సాహిత్యం వినిపించగలవా?”

“అంటే?” తెల్లమొహం వేశాడు రంజిత్‌. పక్కనున్న తన మిత్రుల్నీ చూశాడు. అందరూ పెదవి విరిచారు.

“అంటే - పాటలో అక్షరాలూ, వాక్యాలూ భాయ్‌” అని కొంచెం వ్యంగ్యస్వరంతో అరిచారెవరో.

“అదా!” అంటూ ఒక యువతి ముందు కొచ్చి రంజిత్‌ చేతిలోని మైకుని అందుకోబోయింది. ఈలోగా రంజిత్‌ కొంచెం కోపంగా “ఏంటిసార్‌, ఏవేవో అడుగుతున్నారు?” అని “అంతా బీట్‌సార్‌. దాన్నిబట్టి మా మూమెంట్స్‌ సెట్స్‌ చేసుకుంటాం” అంటూ “ఈ మాత్రం తెలీదా?” అన్నట్టు చూశాడు. మైక్‌ని ఆ యువతికి అందించాడు.

“నీ పేరు?” శ్రుతకీర్తి అడిగింది. “నవ్యప్రియ" అని “బిగినింగ్‌ వోన్లీ ఐనో సారూ?” అంటూ పాడింది. “వచ్చి...వచ్చి...అహ వచ్చి...వచ్చీ...వచ్చీ ఎయ్‌మాకురా...సచ్చి... సచ్చి...సచ్చి...నోడా...హయ్‌...గుచ్చి... గచ్చి...గుచ్చి సంపమాకురా” ఆమె పాటతో పాటూ ఈలలూ, చప్పట్లూ...వాయిద్యాలూ, ఆమె స్టెప్సూ అన్నీ కలగాపులగం, శబ్దకాలుష్యం, హోరూ...రొద....!

నవ్యప్రియని చేత్తో దగ్గరికి లాక్కుని “హాయ్‌ ఫైన్‌...నైస్‌” అంటూ హగ్‌ చేశాడు రంజిత్‌.

అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు. ప్రేక్షకుల్లో నుంచీ ఎవరో పెద్దగా “మార్కులు?” అని అరిచారు. “మేగ్జిమమ్‌” అని అరిచారు మరికొందరు ప్రేక్షకులు.

శ్రుతకీర్తీ, చంద్రభాగా కూడా ముఖ కవళికలు మార్చి, ఒకరి మొహాలొకరు చూసుకుని, “అబ్బే! ఇదెక్కడి తీర్పు?” అన్నట్టూ “అసలీయనగారెక్కడ దొరికారు?” అన్నట్టూ యాంకర్‌ వైపు చూశారు.

యాంకర్‌ తన చేతిలోని మైక్‌ని ఆన్‌చేసి, “జడ్జిగారి ఒపీనియన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. లైట్‌ తీసుకోకూడదు” అని సలహా ఇచ్చింది.

ఆమె నవ్వుతో చెట్టంతయింది. ఆ వెంటనే డ్రెస్‌ని సర్దుకుని లేచి వేదికనెక్కింది. టీమ్‌తో కలిసి 'స్టెప్స్‌' కొన్ని వేసింది.

'జడ్జెస్‌ అందరూ మాట్లాడతారు” - యాంకర్‌, మిగిలిన ఇద్దరూ కూడా వేదికమీదికి వచ్చారు. శ్రుతకీర్తి రెండు నిముషాలు తన కాలంలో ఇలాంటి “షోలు రానందుకు చింతించింది. చంద్రభాగ మళ్ళీ ఏమీ చెప్ప కుండా అందరికీ కలిపి 'యూఆర్‌ ఆల్‌ ఫ్యూచర్‌ స్టార్స్‌” అన్నది. కరతాళ ధ్వనులు. రంగనాథం గారు తన కంఠం విప్పారు. 'నాకు తెలీ కడుగుతాను. ఇది డాన్సా? అసలు దీని ప్రయో జనమేమిటితో మొదలుపెట్టి తెలుగు భాషని మంటగలుపుతున్నారని ఆక్రోశించాడు. ఒక్క వాక్యమైనా పూర్తిగా తెలుగులో చెవ్పలేని రేపటి పౌరుల్ని పనికిరానివారుగా తయారుచేస్తున్న ఈ కార్యక్రమాల్ని నిషేధించాలి” అని గొంతెత్తి పలికాడు.

అటువైవునుంచీ - పీలగా ఎవరో 'అవునవు'నంటూ అరిచారు. ఎక్కువమంది 'ఆపండి ఆపండి' అని కేకలు పెట్టారు.

ఈలోగా టైమయిపోయింది. జరజరా పాక్కుంటూ ప్రకటన వచ్చేసింది. ప్రాయోజిత కార్యక్రమం!

పురుషోత్తం బావ 'బాగుంది.. బాగుంది' అంటూ 'అమ్మాయ్‌ ఇంకో కాఫీ కొట్టు... తాగి వెళ్తాను' అన్నాడు. శారద ఆ పనిలోకి వెళ్ళింది.

నేను నోరూరుకోక “ఆ రంగనాథం గారు నాకు తెలుసు. చాలా సాహిత్య సభలకు వస్తూ ఉంటారు. సంగీతంలో కూడా నిధి” అన్నాను.

“ఎంత ఘనుడైతేనేం. అలా బిహేవ్ చెయ్యకూడదు” అనేశాడు. నేను విస్తుపోయి చూశాను.

“అవును. న్యూట్రెండ్స్‌ తెలియవు. అసలలాంటి వాళ్ళని పిలవటం తప్పు” అని తేల్చేశాడు.

“మరి తెలుగుభాష ఇట్టా ఖూనీ కావలసిందేనా?” అన్నాను కొంచెం ఉద్వేగంతో.

“మీలాంటి వాళ్ళతో ఇదే చిక్కు రియా

22

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018