ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుగు జనాభా


స.వెం.రమేశ్

పొరుగు రాష్ట్రాలలోని తెలుగువారు

కొడిగట్టిపోతున్న తెలుగు భాషాదీపం

భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తూ, భరతమాతకు వడ్డాణం లాగా వింధ్యపర్వతాలున్నాయి. ఈ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీసుగడ్, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలూ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలూ, పాండిచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతమూ ఉన్నాయి. చదువరుల సులువు కోసం దీనినంతా కలిపి నేనిక్కడ దక్షిణ భారత దేశం అంటున్నాను. ఈ దక్షిణ భారతదేశంలో ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారున్నారు. ముఖ్యమైన భాషలు: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠి, ఒరియా, గోండి, ఉరుదూ, తుళు, కొంకణి, కొడగు. ఇవిగాక కొద్ది కొద్ది మంది మాట్లాడే రకరకాల కొండవాసుల భాషలున్నాయి.

శాతవాహనుల కాలం నుండీ ఆంగ్లేయుల రాకవరకూ ఈ దక్షిణ భారతదేశం అంతా చిన్నా పెద్దా రాజ్యాలుగా వుండేది. కొన్ని కాలాలలో కలిసి వుండేది. ఎన్నో సమయాలలో చిన్న చిన్న రాజ్యాలుగా వుండేది. ఆంగ్లేయుల పరిపాలనా కాలానికి ఈ దక్షిణ భారతదేశం మద్రాసు, మైసూరు, నిజాం, తిరువాన్కూరు, కొచ్చిన్, రాష్ట్రాలుగానూ, బొంబాయి, మధ్యరాష్ట్రాలలో కొంతభాగంగానూ వుండి పోయింది.

తెలుగు వారి ఆందోళనలూ, అలజడుల కారణంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ఇప్పుడు మొదట వివరించిన పద్ధతిలో ఉన్నది.

తెలుగువారు ఎందరున్నారు?

దక్షిణ భారతదేశంలో ఈనాటికీ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. మిగిలిన అన్ని భాషలవారూ కలిసినా కూడా తెలుగు వారొక్కరే పెద్ద సంఖ్యలో వున్నారు. దక్షిణాదిన నేటికీ 50 శాతం పైగా తెలుగువారున్నారు.

తెలుగువారి సంఖ్యను ఇంకొంచెం వివరంగా చెబుతాను.

ఆం. ప్ర. జనాభాలో 90% అంటే సుమారు 7 కోట్లు

తమిళనాడులో 42% అంటే సుమారు 2 కోట్లా 80 లక్షలు

కర్ణాటకలో 33% అంటే సుమారు 1 కోటీ 70 లక్షలు

మహారాష్ట్రలో 16% అంటే సుమారు 1 కోటీ 50 లక్షలు

ఒరిస్సాలో 22% అంటే సుమారు 80 లక్షలు

ఛత్తీసుఘడ్లో 20% అంటే సుమారు 80 లక్షలు

కేరళలో 12% అంటే సుమారు 40 లక్షలు

అంటే దక్షిణ భారతదేశంలో పద్నాలుగున్నర కోట్లకు పైగా తెలుగువారు ఉన్నారు. ఉత్తరభారతం, ఇతర దేశాలలోని తెలుగువారిని కలుపుకుంటే తెలుగువారు 15 కోట్ల పైమాటే. అంటే భారతదేశంలో ఎక్కువమందికి తల్లిపలుకు తెలుగే. ఆంధ్రప్రదేశ్ కు బయట దక్షిణాదిన ఏడున్నరకోట్ల మంది తెలుగు వారున్నారు. ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారి సంఖ్య కంటే పెద్దది

తెలుగు దీనస్థితి కి కారణాలు ఏమిటి?

ఇంత పెద్ద భాష ఎంతో చరిత్ర కలిగిన భాష ఇట్లా దీన పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? కాస్త చూద్దాము.

1 వ కారణము: పరాయిభాషల వారి పరిపాలనలో వుండిపోవడము. దక్షిణాదిన ఎక్కువ భాగం, ఎక్కువకాలం ఆంధ్రరాజులే పరిపాలన చేసినారు. కొన్ని ప్రాంతాలు మాత్రం అన్ని కాలాలపాటు ఇతర రాజుల పరిపాలనలో వున్నాయి. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత చాలా ప్రాంతాలు ఉర్దూ భాషీయుల చేతిలోనికి, వారి ద్వారా ఆంగ్లేయుల చేతిలోనికి పోయాయి. ఇదొక కారణము.

2 వ కారణము: తెలుగువాడికి మొదటినుంచీ కూడా తెలుగుభాషపై పట్టనితనం. అదిప్పుడు మనం కనులారా చూస్తూనే వున్నాం. ఏదో ఒక పొరుగు భాషపైన విపరీతమైన ఆకర్షణ తెలుగువాడికి. ఇది ఇప్పుడే కాదు. మొదట్నించీ వున్నదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంగ్లానికి పెద్దపీట వేసినట్లే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువాడు తమిళానికీ, మైసూరురాజ్యంలోని తెలుగువాడు కన్నడానికి, ఒరిస్సాలోని వారు ఒరియాకు, మహారాష్ట్రలోని వారు మరాఠీకి, జాతీయభాష పేరుతో వచ్చిన హిందీకి, పెద్దపీట వేసినారు హిందీని జాతీయభాషగా ప్రచారం చేయడంలో తెలుగువాడిదే పెద్ద చేయి. తెలుగువాడి సాయమే లేకుంటే ఉత్తరాదిన కేవలం 13 కోట్ల మందికి మాతృభాష అయి వుండి, దక్షిణాదిన ఉనికేలేని హిందీ ( ఇప్పటి లెక్కల ప్రకారం) జాతీయభాష అయిఉండేదే కాదు. రాజుల కాలంలోనూ అంతే సంస్కృత ప్రాకృత భాషలకే పెద్దచోటు. శాతవాహనులు ప్రాకృతంలో గ్రంథాలు రాస్తే, పల్లవులు ప్రాకృతంతో పాటు తమిళంలో శాసనాలే వేసినారు చరిత్రలో నిన్న మొన్నటి రెడ్డిరాజులు కూడా సంస్కృత గ్రంథాలే వ్రాసినారు.

3 కారణము: ఇది కేవలం ఇతర రాష్ట్రాల్లోని వారికి చెందినది, ముఖ్యమైనది కూడా ఏమిటంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్ప డటం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఎందుకు అడిగినారో అర్థమే కాదు ఇక్కడ నేను ఆనాటి పెద్దలను విమర్శించాలను కోవడం లేదు ఆనాటి ఉద్యమస్ఫూర్తిని త్యాగధనులనూ తప్పు పట్టడం లేదు. జరిగిన చరిత్రను, ఇన్నాళ్లూ పెద్దలు దాచి పెట్టిన విషయాలను చెబుతున్నానంతే. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనాన్ని భరించలేక ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలయిందని మనం చరిత్ర పుస్తకాలలో చదువుతున్నాం ఇది నిజమేనా ? బాగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది మాంటేగ్-చేమ్స్ఫ్‌ర్డ్ సంస్కరణలు వచ్చి భారతదేశంలో ఎన్నికలు జరిగి భారతదేశంలో స్థానికులకు పరిపాలనలో చోటు కల్పించడం మొదలయింది 1920లలో. అప్పటికే ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలైవుంది నిజంగా అప్పటి పెద్దలు

10

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018