ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు భాషావేదిక

జాలవేదిక (వెబినార్‌)

తెలుగు భాషాభిమానులను అందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావాలి అన్న ఆశయంతో ప్రతి ఆదివారం సాయంత్రం 4.30 ని.కు అంతర్జాలంలో తెలుగు జాలవేదిక (వెబినార్‌) ను హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారి ఆధ్వర్యంలో డా. తొట్టెంపూడి శ్రీగణేశ్‌, 'హైడెల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం, జర్మనీ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 6 సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ జాలవేదిక లో ప్రపంచమంతటా ఉన్న తెలుగు భాషాభిమానులు, సాహిత్య అభిమానులు పాల్గొని ప్రస్తుత తెలుగు భాష యొక్మ స్థితిగతులను చర్చిస్తున్నారు. తెలుగు భాష ఉనికి విద్యా మాధ్యమంలో, దైనందిన వ్యవహారాల్లో ప్రశ్నార్ధకం అవుతున్న తరుణంలో తెలుగువారిలో అమ్మభాష పట్ల తమ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకు తెలుగువారిలో మాతృభాషాభిమానాన్నీ సరైన ఆలోచనా విధానాన్నీ రేకెత్తించేందుకు ఈ జాలవేదిక (వెబినార్‌) కృషిచేస్తోంది.

21 జూన్‌ 2020న జరిగిన తెలుగు జాలవేదిక ఆరవ సమావేశంలో, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన, ముఖ్యవక్తగా 'నడుస్తున్న చరిత్ర,' తెలుగు భాషోద్యమ పత్రిక “అమ్మనుడి” సంపాదకుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డా. సామల రమేష్‌బాబు పాల్గొని “తెలుగు భాషోద్యమం- తొలి నుంచీ తుదికి -భాషోద్యమానికి సెద్ధాంతిక స్పృహ” అన్న అంశంపై వివరణాత్మక ప్రసంగం చేశారు. 2003లో ప్రారంభమైన తెలుగు భాషోద్యమ సమాఖ్య, తెలుగు భాష అస్తిత్వాన్ని నిలపటంలో చేస్తున్న కృషినీ, ప్రస్తుత సమాజంలో భాషోద్యమ ఆవశ్యకతనూ వివరించారు.

తరువాత ఆచార్య పొట్టి (శీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి డా. ఆవుల మంజులత మాట్లాడుతూ మాతృభాషలో విద్యాబోధన జరగవలసిన ఆవశ్యకతను, అందుకు విరుద్ధంగా ప్రస్తుత సమాజంలో ఆంగ మాధ్యమంలోనే విద్యాబోధన అన్న వింతపోకడల మీద ఒక విశ్లేషణాత్మకమైన పరిశోధనాత్మకమైన చర్చకు అవకాశం కల్పించారు. ఈ జాలవేదిక (వెబినార్‌) లో ఇప్పటివరకూ సుమారు 800 మందికి పైగా నమోదుచేసుకున్నారు. మాతృభాషలో విద్యాబోధన మీద, ప్రస్తుతం తెలుగు భాష గురించి తెలుగువారిలో ఉన్న అనుమానాలనూ, అపోహలనూ తొలగించటానికి తార్కిక హేతుబద్ధ విధానంలోపాల్లొన్న వారందరికీ ప్రశ్నించే అవకాశాన్ని ఇస్తూ సరైన అవగాహన ఏకాభిప్రాయ సాథనకూ ఈ జాలవేదిక(వెబినార్‌) చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఆసక్తిగలవారు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారిని 9866128846లో సంప్రదించవచ్చు