ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుస్తక సమీక్ష

మానవ హక్కులు

ఒక అందమైన కల


అనువాదం,వ్యాఖ్యానం :
పెండ్యాల సత్యనారాయణ

వెల : రు.300/-

ప్రతులకు:సుప్రీములాహౌస్‌,
విజయవాడ
ఫోన్‌: 0866-6695 554


న్యాయ శాస్త్రకోవిదులు, న్యాయవాదిగా సుదీర్ధకాలంగా కృషి చేయటమే కాకుండా, ఇప్పటి వరకు వందకు పైగా న్యాయసంబంధిత శాసనాలను తెలుగు చేసిన పెండ్యాల సత్యనారాయణ వెలువరిచిన ఒక ఉత్కృష్ట గ్రంథం “మానవ హక్కులు ఒక అందమైన కల”. మానవహక్కులు రాజ్యాంగంచే హామీ ఇవ్వబడిన, జీవించేహక్కు స్వేచ్చ, సమానత్వం, గౌరవప్రదమైన వ్వక్తిత్వానికి సంబంధించినవి. ఇతర చట్టబద్ధమైన హక్కులకు మానవ హక్కులకు మౌలికంగా ఒక తేడా ఉంది. మనిషి మనుగడకు అవసరమైన కనీస ప్రాధమిక హక్కులే మానవ హక్కులు. ఇతర చట్టబద్ధ హక్కులను ప్రభుత్వాలు సృష్టించవచ్చు, పరిమితం చేయవచ్చు, సవరించవచ్చు లేదా రద్దు కూడా చేయవచ్చు, కాని, మానవహక్కులు సార్వజనీనమైనవి. సహజ సిద్ధమైనవి, వీటిని ప్రభుత్వాలు సృష్టించలేవు, రద్దు చేయలేవు. ప్రభుత్వాలు చేయగలిగిందల్లా ఈ మానవహక్కుల సంరక్షణ బాధ్యత వహించటమే.

నాలుగు భాగాలుగా విభజించబడిన ఈ గ్రంథంలో 16 అధ్యాయాలు ఉన్నాయి. బానిసవ్యవస్థలో మానవహక్కులు ఏవిధంగా ఉన్నదీ, వాటి పరిధి, వాటి సిద్దాంతాలు నిర్వచనంతోపాటుగా భారతరాజ్యాంగంలో మానవహక్కులు, ఇతర సమస్యల గురించి ఒకటి, రెండు భాగాలలో సవిస్తరంగా పేర్మొనబడింది. మూడవ భాగంలో ప్రపంచదేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను మానవ హక్కులు ఏవిధంగా పాటించబడుతున్నదీ వివరించబడింది. 4వ భాగంలో అంతర్జాతీయ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి వ్యవస్థాగత నిర్మాణం, ఐరాస కార్యక్రమాలు, వివిధ కమిషన్‌లు, మండలులు, సంస్థల ద్వారా మానవహక్కుల ప్రకటన, ప్రపంచ పౌర, రాజకీయ హక్కుల ప్రకటన, ప్రపంచ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ప్రకటనల వివరాలతోపాటుగా మానవవహాక్కులపై నిర్వహించబడుతున్న వివిధ ప్రాంతీయ సదస్సుల గురించి ఇలా ఎంతో విలువైన సమాచారాన్ని కూలంకషంగా చర్చించిన రచయిత, 18 వ అధ్యాయంలో మానవహక్కుల పరిరక్షణలో రెడ్‌క్రాస్‌, అమ్నెప్టీ ఇంటర్నేషనల్‌ వంటి స్వచ్చంద సంస్థలు అంతర్జాతీయంగాను, భారతదేశంలోని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (PUCL), ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ (APCLC), ఆర్గనైజేషన్‌ ఫర్‌ ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రైట్స్‌ (OPDR) ఆల్‌ ఇండియా పీపుల్స్‌ రెస్టిస్టెన్స్‌ ఫోరం (AIPRF), స్త్రీ ఆధార్‌ కేంద్రం (పూనే) వంటి సంస్థలు - మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భాలలో, ఆ హక్కుల పరిరక్షణ కోసం ఏరకంగా ఉద్యమిస్తున్నదీ ఎలా యుద్ధం చేయాలి అన్న విషయాల గురించిన సమగ్ర సమాచారం ఇవ్వబడింది.

నిశితంగా చదివినట్లయితే, ఒక చట్ట విషయమైన వస్తువును తీసుకుని, అందులోని సంక్షిష్టకను తొలగించి, సామాన్య పాఠకునికి కూడా సులభంగా అర్ధం అయ్యే విధంగా సరళము, సుబోధకంగా తెలుగులో అనువదింవబడిన గ్రంథంగా దీనిని పేర్కోనవచ్చు. అంతేకాకుండా, వ్యావహారిక తెలుగు భాషలో, సందర్భానుసారంగా వ్యాఖ్యానాలను జోడించి, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను విశ్లేషణ పూర్వకంగా ఉటంకిస్తూ ఈ చట్టాన్ని మనకు అందించిన రచయితను అభినందించి తీరవలసిందే! న్యాయశాస్త్ర విద్యార్దుల పాఠ్యాంశాలలో ఒక విషయమైన మానవహక్కుల గురించి కేవలం వారి కోసమే కాకుండా సాధారణ తెలుగు ప్రజలకు కూడా అవగాహన కల్పించేవిధంగా ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగిందని రచయిత ముందుమాటలో చెప్పినట్లు ఈ రచన సాగింది. ఎంతో విషయపరిపుష్టమై, మానవహక్ములపై వచ్చిన ఈ పుస్తకం ఒక సిద్దాంత గ్రంధాన్ని పోలి ఉందంటే అతిశయోక్తికాదు.

మన రాజ్యాంగం మానవ హక్కులకు పెద్దపీట వేసినా, వాటి అమలులో పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయనీ; ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వమే కొనసాగుతున్నదని, పాలకవర్గ పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ ఉల్లంఘనకు, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్చడుతున్నాయని రచయిత అభిప్రాయంగా మనకు తెలుస్తుంది. నిజమైన మానవహక్కులు వర్దిల్లాలంటే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలింపబడి, దాని స్థానంలో మరింత హేతుబద్ధమైన ప్రజాస్వామ్యయుతమైన కమ్యూనిష్టువ్యవస్థ రావాలని రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా పాఠకులు ఏకీభవించకపోవచ్చు. ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంతకాలం “మానవహక్కులు ఒక అందమైన కల” అని రచయిత కొంత నిరాశాపూర్వకంగా వ్యాఖ్యానించినా “ఆ కల సాకారం అయ్యేది మాత్రం తథ్యం. అందుకు మన వంతు కృషి చేద్దాం, ఈ దోపిడీ వ్యవస్థకు చరమగీతం పాడుదాం, కనీసం మనకోసం కాకపోయినా, మన ముందుతరాల కోసం” అంటూ ఆశాభావం కూడా రచయిత వ్యక్తం చేశారు. ఈ పుస్తకం పాఠకులకు ఈ హక్కులపై అవగాహన కలిగించి, కొద్దిమందినైనా ఆలోచింపచేస్తే తన లక్ష్యం నెరవేరుతుందన్న రచయిత విశ్వాసం నెరవేరుతుందని, నెలవేరాలని కోరుకుందాం!

- ఎం.వి.శాస్త్రి
9441342999