ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాత్రాసాహిత్యం

మూల రచన : జూలియా చార్జోటి

(గత సంచిక తరువాయి...)

అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ,

డా.కాళీదాసు పురుషోత్తం 9000642079

“ఆమె లేఖలు”


ఎనిమిదవ, తొమ్మిదవ లేఖలు

ఆమె మద్రాసు చేరిన రెండు నెలల తర్వాత మరోసారి ఆ పట్టణం గురించి రాస్తుంది. 1837 ఫిబ్రవరి 3వ తేది రాసిన ఉత్తరంలో -

“నీ జాబులన్నీ ఇప్పుడే చేరాయి. ఇక్కడ మేం నెలకోసారి వచ్చే తపాలాకు ఎంతగా మొహం వాచిపోయి ఉంటామో! అది వచ్చినపుడు ఎంత సంబరపడిపోతామో ఊహించుకోలేవు. మరికొన్ని రోజుల్లో తపాలా వస్తుందని తెలియగానే మద్రాసంతా అట్టుడికి పోతుంది! ఎప్పుడొస్తుందా, ఏం తెస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తూ, ఇంకా త్వరగా రావాలని, రావలసిందానికంటే కొన్ని రోజులు, కనీసం కొన్ని గంటలు ముందయినా రావాలని గడిపేస్తాం. తపాలా రాగానే ఆ వార్త దావానలంలా అన్ని దిక్కులకీ వ్యాపిస్తుంది. పోస్టుమన్‌ తెచ్చేదాకా ఆగలేక, తపాలా ఇవ్వగానే తీసుకురమ్మని ప్రతివాళ్ళు తమ బంట్రోతుల్ని పోస్టాఫీసుకు తరుముతారు. ఇతర వ్యాపకాలు, పనులన్నీ మరచిపోతారు.

మద్రాసు పరిసరాల్లో ఇసుకతరినేల, మైదాన ప్రాంతం, సగం సాగు చేసిన తోటలు, వాటి చుట్టూ ఎత్తయిన కంచెలు, శిథిలావస్థలో వున్న పెద్ద పెద్ద యిళ్ళు వుంటాయని ఆమె వర్ణిస్తుంది. “ఇక్కడ మనకు భూరిభవనాలు - ముఖ్యంగ దేవాలయాలు కనబడ తాయి. అయితే అవేమంత అందంగా వుండవు. భవనాలకు వేసిన రంగులు అంత కాంతివంతంగా వుండవు. సూర్యాస్తమయం ఒక్కో సారి చాలా అందంగా వుంటుందిగానీ సాధారణంగా ఆరంగులు మనకళ్లు చెదిరిపోయేట్లుంటాయి. మొత్తం మీద మద్రాసు ఏమంత గొప్ప ప్రదేశంగా భావించను అంటుంది. పల్లె ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని, అక్కడి దృశ్యాలు చూచి ఆశ్చర్యపోతారని ఆమెకు కొందరు చెప్పారట. పల్లెల్లో పొలాలు, తోటలు వుంటాయి. గనక ఆరోగ్యకరంగా వుండవచ్చునేమోగానీ, అసలు గాలిలో పరిశుభ్రతే కొరవడిందని ఆమె భావిస్తుంది. దేవాలయాల్లోని పువ్వులు తప్ప, మరేపువ్వులూ పరిమళించవని, వాడిపోయి వుంటాయని, ప్రతి వీధి మలుపులో వంటకాలు, కొబ్బరినూనె వేపుడు, ఇంకా రకరకాల వాసనలు వస్తుంటాయని ఆమె వర్ణిస్తుంది.

“ఇప్పుడే మా ముషీ కొన్ని కేకులు పంపాడు.”

“విదేశీ వస్తువు ఏదైనా - మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఆటవస్తువుల్ని చూసి నేటివులు చాలా ఆశ్చర్యపోతారు. మన ఆటబొమ్మల్ని వాళ్లెంతగా ఇష్టపడతారంటే, వాటిని వాళ్ళు వెంటనే దేవుడి బొమ్మలుగా మార్చేస్తారు” అంటూ, భారతీయుల అజ్ఞానం, విగ్రహారాధనల గురించి ఇంగ్లీషు వారికి ఇంకా పూర్తిగా తెలియదని వ్యంగ్యంగా చెప్తుంది. “ఒక పిల్లవాడు ప్రపంచపటంలో యూరపును గుర్తించడం నేర్చుకొంటే అది చాలా గొప్ప విజ్ఞానంగా వీళ్లు భావిస్తారు. వీళ్లకి తమ దేశ చరిత్రను గురించి మనకెంత తెలుసో అంతే తెలుసు, ఐనా అధ్యయనం చేయదగిన విషయాలన్నీ ఇదివరకే తెలుసునని వీళ్ళు అనుకొంటారు!”

మద్రాసులో మిస్టర్‌ ఎన్‌ - అనే ఆయన నేటివుల్లోని ఉన్నత వర్ణాలవారి కోసం, తన యింట్లో వారంవారం గోష్టులు నిర్వహిస్తున్నాడని, ఆ గోష్టుల్లో పది మందికి సంబంధించిన సంగతులు చర్చకు వస్తూంటాయని ఆమె చెప్తుంది. ఎప్పుడూ వేతనాల్ని గురించి, లేకపోతే ఏ వజ్రాల చెవిపోగులను గురించో మాట్లాడుకోవడంతో సరిపెట్టుకొనే నేటివులు అంతకన్నా పెద్ద విషయాల గురించి ఆలోచించేందుకు ఈ గోష్టులు ఉపకరిస్తాయని ఆమె ఆశించింది.

మాకు తెలిసిన ఒకాయన నిన్న రాత్రి ఆ గోస్టికి వెళ్ళి వచ్చాడు. గోష్టి ఎలా జరిగిందని, దీన్ని గురించి మాట్లాడారని వాకబు చేస్తే, భారత ప్రభుత్వానికి, పన్నుల విధానానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక విషయాలపై మాట్లాడారని చెప్తూ “కానీ వాటి వల్ల ప్రయోజనం ఏముంది లెండి ? అన్నీ అయ్యగారు చెప్పిన విషయాలే! ఐనా కాసేపు వింటూ అలా కునుకు దీశాన”ని అన్నాడు. “ఒక్క ధనార్దనలో తప్ప, తక్కిన ఏ విషయంలోనైనా ఇదే వీళ్ల ధోరణి. డబ్బు విషయంలో మినహా, మరెందులోనూ వీళ్ళలో చైతన్యం కనిపించదు” అని ఆమె వ్యాఖ్యానిస్తుంది. ఆ వ్యక్తి యూరోపియన్ల వద్ద చేరేవారిలో చాలామంది లాగా సగం హిందువు, సగం కైస్తవుడు. తనది కైస్తవ మతంలాంటిదేనని చెప్పుకొంటాడు. మతంలో వివిధ సంస్కారాలకు సరిపడేవిధంగా నాలుగు తరగతులున్నాయని, వాటిలో అన్నిటికంటే అధమస్థానంది విగ్రహారాధన అని, అది సామాన్య ప్రజలకు సరిపోతుందని అతను అన్నాడు.

కొందరు ఈ వివిధ దశలను దాటుకొని అత్యున్నత స్థాయి చేరుకొంటారని, అప్పుడు వాళ్ళు అన్నిట్నీ అర్ధం చేసుకొని మార్గాలు వేరైనా మతాలన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని గ్రహిస్తారని అతను అంటాడు. ఎ - అతనితో చాలా సేపు వాదించారు. కానీ ఏం ప్రయోజనం లేదు. అతను అంతావిని, *“అవున్సార్‌! నేను చెప్పేదీ అదే* అని జవాభిస్తాడు.

ఆమె వుత్తరాన్ని మరో మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 12వ తేది పూర్తి చేస్తూ బిషప్‌ కొరీ మరణాన్ని గురించి రాస్తుంది. “భిషప్‌ కొరీ మరణానికి మద్రాసులో చాలా విచారిస్తున్నారం "టూ ఆయన గుణగణాలను ప్రస్తుతిస్తుంది.

తర్వాత తమ యింట్లో జరిగిన చిన్న దొంగతనం, అందులో నౌకర్ల వ్యవహారం గురించి ఆమె రాస్తుంది.

ఆమె, ఆమె భర్త “ఎ ' మద్రాసులో కొంతకాలం తమ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

48