ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి: 5 సంచిక: 3

అమ్మనుడి

మే 2019

సంపాదక హృదయం

'నడుస్తున్న చరిత్ర'ను ఆదుకొన్న ఎస్. పి. వై. రెడ్డిగారు

రాత్రి 10.30కు మిత్రుడు శ్రీ బి. ఎస్. రాములు ఫోన్ చేసి 'ఎస్. పి. వై. రెడ్డిగారు చనిపోయారట, టీవీలో వార్త వస్తున్నది' అని చెప్పారు. నేను ఏదో కుదుపుకు లోనవుతున్నట్లు అనిపించింది.

1995 నాటి నుంచీ స్నేహం. 1993 డిసెంబరులో నడుస్తున్న చరిత్ర మొదటి సంచికను వెలువరించినా, ఆ తర్వాత అది ఆటుపోటుల్ని తట్టుకొని 2013 అక్టోబరు వరకూ కొనసాగుతుందని, ఒక చరిత్రను సృష్టిస్తుందనీ నేనెన్నడూ ఊహించలేదు. మిత్రుడు నౌరోజీరెడ్డిని తోడు తీసుకొని 'నంది పైపుల కంపెనీ' ప్రకటనలకోసం ఎస్. పి. వై. రెడ్డిగారిని నంద్యాలలో కలవడంతో మొదలైన స్నేహం ఇరవయ్యేళ్లపాటు నడుస్తుందని నేను అనుకోలేదు. తొలిసారి కలిసినపుడు నన్ను ఎస్. పి. వై. కి పరిచయం చేస్తూనే 1975లో ఎమెర్జెన్సీ చీకటి అధ్యాయం నాటి సంగతులనూ, నేను నిర్వహించిన పాత్రనూ నౌరోజీ ఆయనతో చెప్పారు. వైద్యుడుగా నా గురించి చెప్పి, ఇదిగో ఇప్పుడు ఈ పత్రికను పెట్టి, కష్టాల్లో పడ్డాడనీ మీ వంటి పారిశ్రామికవేత్తలు ప్రకటనలు ఇచ్చి అండగా నిలబడాలనీ నౌరోజీ అనేశారు. అప్పుడాయన నా వంక చిరునవ్వుతో చూసిన చూపు నా కెందుకో కొంత శక్తి నిచ్చింది. అప్పటికి ఆయన ఒకసారి ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వున్నారు. రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనే ఆలోచన ఆయనలో బాగా సాగుతూ ఉంది. ఈ సమాజానికేదైనా చేయాలనే తపన వారిలో ఉంది. అప్పటికే కొన్ని కార్యక్రమాల్ని స్థానికంగా చేపట్టారు. ఆ రోజున ఇంటికి భోజనానికి తీసుకువెళ్లారు. మితభాషి అయినా, క్లుప్తంగా ఆయన మాటల్లో భావాలు బయట పడుతూనే ఉన్నాయి. 'నెలకోసారి రా అన్నా', 'ప్రకటన' తీసుకొన్నట్లు ఉంటుంది. సామాజిక అంశాలు, రాజకీయాలు మాట్లాడుకొంటూ ఉందాం అన్నారు. నెలనెలా కాకపోయినా తరచుగా ఆయనను కలవడం సాగింది. నేను ఆయన్ను కలువడానికి వెళ్లే ముందు ఆయనకు ఫోన్ చెయ్యడం, వెళ్లిన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *

మే 2019

7