ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాష విషయంలో ఉద్యమధారిగా ఆయన కనబడకపోయినా ఒక ఆంతరంగిక తరంగిత ఉద్యమం వుందేమో అనిపిస్తుంది.

అన్నీ పద్య కావ్యాలలో రాయడం పట్ల ఆయనకు కొంత అయిష్టం లేకపోలేదు. తానూ సంప్రదాయ మార్దానుసారిగా ఎంతగానో కొనసాగినా సంస్మరణ అంశాలు రాకపోతే కందుకూరి అవరు కదా. అందుకే

“పుస్తకములను సంస్కృత భాషలో వ్రాయుట కంటే దేశభాషలలోనే వ్రాయుట మేలైనపని. అట్టి ఉపయుక్త గ్రంథములను వచనములలో వ్రాయుట ముఖ్య కార్యము” అని ఆయన సూటిగా అనుభవ జ్ఞానంతో ప్రజావసర గ్రహింపుతో నుడివినాడంటే అది ప్రశంసనీయం కదా! అయితే కవిత్వ గ్రంథాలు వచనేతర రచనలుగా ఉండవచ్చని కూడా ఆయన అభివ్రాయం.

భాషా సాహిత్య సంబంధంగా ఆయనకుగల భావాలకు 'సరస్వతీ నారద సంవాదం” అనే చిన్న పుస్తకమే దాఖలా.

ఆంగ్ల పదాలకు ఆంధ్రపద సృజనలు

కవి, పండితుడు, పత్రికాధిపతి, కావ్యనిర్మాత సంస్కార కావ్య విధాత అయిన కందుకూరికి ఆంగ్ల భాషా పదార్థాలకు సరితూగే సాంస్కృతిక ఆంధ్ర భాషా పద సృజనలు చేసిన భాషా ప్రయోగశీలిగా కూడా స్మరణీయులే.

పరిశోధ దృష్టిగల రచయిత డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు ఏకంవిధ పరసృజనలను పరిశీలించి లెక్కగట్టి 300 అని తేల్చారు.

వీరేశలింగ పదసృజనలు తెలుగు అకాడమీ చేసిన పద సృజనలు వంటివిగ కనపడినా అకాడమీలూ గికాడమీలు చేయని పనిని ఆ కాలంలో అలా తానుగా చేయడం అవిస్మరణీయం. మచ్చుకు కొన్ని...

ఆంగ్లం - ఆంధ్రం
కలెక్టరు -కరగ్రాహి
సేవింగ్స్‌ బ్యాంకు బుక్‌ - రక్షణ నిధి పుస్తకము
పోలీసు ఇనస్పెక్టర్‌ - పురారక్షక పర్యవేక్షకుడు
డి.ఎస్‌.పి. - మండల ఆరక్షకాధ్యక్షుడు
రైల్వే - అయోమయమార్గము
బిలియర్డ్స్ టేబుల్‌ - దంతగోళ క్రీడా ఫలకం
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు - అనుష్టాన నియుక్త వాస్తు విద్యా విశారదుడు
స్కూలు ఫైనలు ఎగ్జామినేషన్‌ - పాఠశాలాంతిమ పరీక్ష
సెంట్రల్‌ జైలు - మధ్యస్థ కారాగారము
నాన్‌ అఫిషియల్‌ విజిటర్‌ - అనధికార ద్రష్ట
డిఫ్టిక్టు లోకల్‌ ఫండ్‌ బొర్టు - మండల స్థలనిధి సంఘము

ఇటువంటివి మరెన్నో ! ఈ అనువాద పద సృజనలు ఈ కాలము వారికి హాస్యము పుట్టించవచ్చు. కృతక భాషానువాద పద సృజనల వల్ల తెలుగు అకాడమీ సైతము కొంత హాస్యము పుట్టించింది.


కానీ వీరేశలింగంగారు ఆనాడు ఆ విధంగా ప్రయోగాలు చేసే బుద్ధి నైశత్వానికి ఆనందించి తీరాలి. ప్రత్యేకంగా 'తెలుగు ' అనే ఆలోచనలు లేనికాలంలో సంస్కృత వినియోగానికి అలవాటు పడిన కాలంలో ఈ పదానువాదాలు జరిగాయి.

ఇంతకీ ఇంత భాషా సేవ చేసిన వీరేశలింగంగారు తమ స్వీయ చరిత్ర రెండవ ప్రకరణలో “తెలుగు భాషను వృద్ధి చేయవలెనన్న అభిలాషము నాకు మొదటి నుండియు విశేషముగా నుండెను. నేను నా కాలమంతయు భాషాభివృద్ధి నిమిత్తమే ఉపయోగించి పాటు పడిన కొంత వరకు నా అభిలాషము నెరవేఱియుండునేమో " అని రాసుకోడంలో ఆయన హృదయ భావ భాష వెల్లడవుతోంది.

తాను నమ్మకుండా ఏదీ ఆచరించని కందుకూరి వీరేశలింగం వాడుక భాషావాదాన్ని చాలనాళ్ళదాకా, చాలా ఏళ్ళదాకా అంగీకరించ లేదు. ప.గో. జిల్లాలో కొవ్వూరులో జరిగిన ఒక సభలో గిడుగు రామమూర్తిగారి ఉపన్యాసాన్ని శ్రొతల మధ్య ఎక్కడో వున్న వీరేశలింగం విన్నారట. తలపాగతో ఓ పెద్దాయన వచ్చారని, ఆయన వీరేశలింగం గారని తెలుసుకొని సభా నిర్వాహకులు ఆయనను తోడుకొని వెళ్ళారట! అప్పుడాయన వాడుకభాషా వాదాన్ని నేనూ నమ్ముతున్నానని ప్రకటించారట

భార్య ప్రేమికుడుగా : పంతులుగారి భార్య రాజ్యలక్ష్మమ్మ సాధ్వీమణి అంటే సాధ్వీమణే! భర్త కార్యక్రమాలకు త్రికరణశుద్ధిగా తోడ్పాటునిచ్చిన అచ్చమైన జీవిత భాగస్వామి. అర్జాంగికే తన స్వీేయచరిత్రను అంకితం చేశారు కందుకూరి. భార్య అనాయాసంగా మరణించింది. వృద్ధులైన ఆయన దాన్ని తట్టుకోవడానికి రెండు మూడుసార్లు దైవ ప్రార్ధన చేసుకున్నారు. ఆవిడ తెల్లవారు రూమున చనిపోయిన ఆమెను చూడడానికి ఉదయవేళ వేలమంది జనం రావడం ఆయన్ని ఓదార్చడం వారి పట్లగల ప్రజాభిమానానికి దర్పణం. పురమందిర ధర్మకర్తలలో ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము వుండాలని ఆయన రాసి పాటించడం విశాల హృదయ చిహ్నం.

అరడజను కొరతలున్నాా ఆరుడజన్ల మేలుములున్న చోట్ల తగ్గించుకో కూడదు అని బంగోరే అనేవారు. వీరేశలింగం జీవితచరిత్రను గమనించినప్పుడు ఈ వాక్యం గుర్తుకొస్తుంది.

లంచగొండితనం, క్రొత్తక్రొత్త మూఢాచారాలు, ఇంకా శకునాలు చూసుకోవడం, మహిళా సాధికార కార్యక్రమాలకు అడ్డంకులు. సామాజికపు కుళ్లుల ప్రక్షాళణకు - ఇప్పటికీ కందుకూరి స్ఫూర్తి అవసరమే కాదు, అత్యవసరం.

1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలో పుట్టిన పంతులు గారు 1919 మే 27న చెన్నపట్నంలో కీర్తిశేషులయ్యారు.

ఒకటి కాదెన్నో ఉదయించి పెంఫొందె
సకలమ్ము వీరేశ సాహిత్య ఖని యందె
- మధునాపంతుల

ఆ ఖనిలో ఎన్నో లోతులు! ఆలోతులలో ఎన్నో సామాజిక చరితల పొరలు? వాటి సమ్మగ దర్శనంలో అదిగో నవయుగ వైతాళికుడు కందుకూరి రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారకులు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

23