పుట:Ambati Venkanna Patalu -2015.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవడు జేసిన మోసమో..



ఎవడు జేసిన మోసమో
మనమెపుడు జేసిన పాపమో
సుక్కనీరు లేక ఒక్క పని దొరకకా
తల్లి తెలంగాణ తల్లడిల్లుతుంది ఓరన్నా
కరువు కోరల్లోన అల్లాడుతుంది మాయన్నా... ॥ఎవడు॥

నల్లోలిగొచ్చిండ్రు భూముల్ని బట్టిండ్రు
వరిపంట శేండ్లన్ని వడగాల్లో ముంచిండ్రు
ఇటిక బట్టిలు బెట్టి భూసారం మింగిండ్రు
పురుగు మందుల బెంచి పానాలు దీసిండ్రు
ఉన్న ఊరిడిసేసి గొడ్లు జీవాలమ్మి
వలసెళ్ళిపోయేటి కాలాన్ని దెచ్చిండ్రు ॥ఎవడు॥

కాల్మీద కాలేసి కంపెండ్లు బెట్టిండ్రు
తెలంగాణ నిండా పాగబెట్టి కూసుండ్రు
పత్తి పంటలు బెట్టి పండ్ల తోటలు బట్టి
తెలంగాణ జనుల పండ్లోలిగమ్మిండ్రు
మాయ మాటలతోని మన కొంపలు ముంచి
శెట్టెర్క పామోలె సెట్టు కొమ్మెక్కిండ్రు ॥ఎవడు॥

ఆంధ్ర ప్రాంతంలోన కూలినాలి జేసి
ఏమి లేకా ఈడ బతుకొచ్చె బహుజనులు
అన్ని దెలిసి మనమూ ఆడీడ పడగల్లో
బెదిరి పనులు జేసే పాలేర్ల మైతున్నం
ఇకనైన మనమంత కండ్లు దెరిసి ఇపుడు
ఎట్లయిన బహుజనులు ఏకంగ నడువాలె ॥ఎవడు॥

107

అంబటి వెంకన్న పాటలు