ఈ పుట ఆమోదించబడ్డది

మఱియు దోనూరికోనేరునాథుడు 1542 లో వ్రాసిన దానిని 1549 లో రామరాయల మంత్రులలో నొక్కడును కొండవీడు రాజ్యాధిపతిగా నియమింపబడిన రామయామాత్యతోడర మల్లనునాతడు తానురచియించిన 'సర్వమేళకళానిధి' యను గ్రంథమున 'రామరాయలు' తనయిర్వురుతమ్ములతోను విద్యాపురమును విడిచి గుత్తిదుర్గమునకు బోయి నిస్సహాయుడుగా నున్నసదాశివమహీపాలుని గొనివచ్చి స్వామిద్రోహకృతులయినప్రతీపనృపతులను జయించి కర్ణాటసింహాసనమునందు గూరుచుండ బెట్టి కీర్తిస్థాపకు డయ్యెననివ్రాసి బలపఱచు చున్నాడు. [1] ఇతడొక్కడేకాదు; రామరాయలయాస్థానికవిగనుండి యాతనిచే రామరాజభూషణు డనుబిరుదము గాంచినభట్టుమూర్తి తాను రచియించిన నరసభూపాలీయము నందును, వసుచరిత్రమునందును నీవిప్లవప్రశంసను గావించి రామరాయలను వినుతించియున్నాడు.

       "సీ. ఖలునతిద్రోహి సల్కయ తిమ్మనిహరించి
           సకలకర్ణాటరాజ్యంబు నిలిపె"
                         (నరసభూపాలీయము)

  1. స్వరమేళకళానిధి:-

              "య: ఖడ్గైకసఖ: సహానుజయుగో నిర్గత్య విద్యాపురాత్
               లబ్ధ్వా గుత్తిగిరౌ సదాశివమహీపాలం నిరాలమబ నమ్
               స్వామిద్రోహకృత: ప్రతీపనృపతిం నిర్జిత్య భద్రాసనే
               కర్ణాటే భగవానివధ్రువమయం కీర్త్యా సహస్థాపయిత్."