ఈ పుట ఆమోదించబడ్డది

గదిలోని యొకస్తంభమునకు వాడిగలకత్తి నొకదానిమొనపైకుండునటులు బిగింపజేసి యది తనవక్షస్థలమును భేదించుకొని వెన్నుపైకి వచ్చునట్లుగా గొప్పపఱ్వున వచ్చి దానిపైబడి ప్రాణముల గోల్పోయెనట! అంత నగరద్వారముతలుపులు తెఱువ బడిన వట! ఈఫెరిస్తా వ్రాసిన దానితో 'కోరియా' యనుపోర్చుగీసు చరిత్రకారు డేకీభవించుటయె గాక 'సలకముతిమ్మయ' విజయనగర సామ్రాజ్యాధిపతిగ జావవలెనను కోరికతో నట్లుచచ్చె ననికూడ వక్కాణించెనని యారవీటివంశచరిత్రము నందు హీరాసుఫాదిరి నుడువుచున్నాడు.

సలకముతిమ్మయ యుద్ధముచేసి మడియుట

హీరాసుఫాదిరి కోరియాఫెరిస్తాలు శాస్త్రోక్తముగ నిష్పక్షపాతమైనచరిత్రను వ్రాసిరని నమ్మి వారివ్రాతల నాధారముగా జేసికొని అళియరామరాయల చరిత్రములోని మూలసత్యమును గ్రహింపజాలక దుర్ర్భమపాలయి చరిత్రమునంతయు దాఱుమాఱుచేసి వ్రాయుటెంతయు శోచనీయము. వీరు తామువ్రాసినచరిత్రమునం దొకచోట "రామరాయలువచ్చు వఱకు విజయనగరమునందు విజాపురసుల్తాను నిలిచియుండెననియు, వీనివలనె బరీదుషాహా, నిజాముషాహా, కుతుబ్షాహా లాతనికి (సలకముతిమ్మయకు) దోడ్పడు చుండిరనియు హండేవారి అనంతపురచరిత్రము దెలుపుచున్నది. సలకముతిమ్మయాతో మైత్రిచేసికొన్న యీప్రభువులందఱితోను యుద్ధము