ఈ పుట ఆమోదించబడ్డది

పొంగిపోయిన మనస్సంతోషము గలవాడై వృద్ధసేనానియగు అసాదుఖాను ప్రేరేపింప నతడు వెంటనే బయలుదేరి యేవిధమైన యడ్డంకులునులేక స్వేచ్ఛగా విజయనగరమునకు విచ్చేసె ననియు, స్వామి ద్రోహియైన సలకముతిమ్మయ తనమిత్రులగు ప్రభుపుంగవులతో నెదురుగా బోయి వానిసింహాసనము పయి కూరుచుండ బెట్టియేడుదినములు నగరమునం దంతట వేడుకలు జరిపించి రనియు 'కోరియా, ఫెరిస్తా' లను చరిత్రకారులు వ్రాసి యున్నారు. వీరియుభయులవ్రాతలకు ముఖ్యవిషయమున నేకభావమున్నను వివరములలో నేకభావము గన్పట్టదు. వీరిలో 'కోఱియా' విదేశీయుడు. రెండవవా డయినఫెరిస్తా రామరాయలకు గర్భశత్రువు. విజయనగరసామ్రాజ్యమునెడ ననురాగము లేనిచరిత్రకారుడు, అహమ్మదునగరసుల్తా నగునిజాముషాహ కొల్వుకూటమున నున్నమహమ్మదు మతస్థుడు. దేశీయులును, సమకారికులును విజయనగరసామ్రాజ్యమునందున్నవారును వ్రాసిన వ్రాతలలో వీరివ్రాతలను సమన్వయింప జేసి సత్యసంశోధన జేసినగాని సత్యచరిత్రము బయలపడదు. ఆకాలమునందు విజయనగరసామ్రాజ్యమునకు నారవీటివంశము పెట్టనికోటగ నుండెను. సలకముతిమ్మయగావించిన ద్రోహకృత్యముల మూలమున విజయనగరరాజధాని మహావిప్లవముపాలయి హిందూసామ్రాజ్యము వినాశము జెందనున్నకాలమున నీయుపద్రవము నడంచి సంరక్షింప గలమహాసమర్ధు డగువీరాగ్రగణ్యు నొకనిబ్ర