ఈ పుట ఆమోదించబడ్డది

ఈగ్రంథమున నచ్యుతరాయల పట్టాభిషేకకాలమునకు వానితండ్రి నరసరాయలుకూడ బ్రదికియున్నట్టు దెలుపబడియున్నది. ఇదెంతవఱకు సత్యమో దెలియరాదు. అచ్యుతరాయల పరిపాలనకాలమున వానిమఱిదియగు సలకము చినతిమ్మరాజు ప్రధానమంత్రిగనుండి రాజ్యభారము నంతయు దానేవహించి యారవీటి వంశమువారికి నెవ్విధమైనప్రాముఖ్యత కలుగకుండ బహుజాగరూకతతో వ్యవహరించి నటులు గనుపట్టుచున్నది. సామ్రాజ్యములోని మాండలికప్రభువులును రాజబంధువులు నీతని నంతగా బ్రేమించినవారుగా గనుపట్టరు. విదేశీయులయిన చరిత్రకారులు గూడ ననుకూలముగా వ్రాసియుండలేదు. అచ్యుతదేవరాయల మరణానంతరము సలకము చినతిమ్మరాజు తనమేనల్లు డగుచిన్నవేంకాటాద్రీంద్రుని క్రీ. శ. 1541 సంవత్సరములో బట్టాభిషిక్తుని గావించెను. ఈచిన్న వేంకటాద్రి రాజు పట్టాభిషేకకాలమునకు బదునెనిమిది సంవత్సరములయిన గడవనిబాలు డని చెప్ప దగును. ఇతనికినప్పటికి వయస్సెంతయుండెనో యెవరును సరిగాజెప్ప జాలకున్నను బాలుడని యైకకంఠ్యముగా నెల్లవారు నంగీకరించి యున్నారు. కనుక సామ్రాజ్యసార్వభౌముడు నిర్వహింపవలసినకార్యభార మంతయు సలకముచినతిమ్మరాజుపై బడియెను. అతడు సమర్థుడు గాడు; బుద్ధిమంతుడు గాడు; అదియునుంగాక విశేషించి దురాశకలవాడుగను, ఒక్కొక్కప్పుడవివేకపుం బనులొనర్చువాడుగను నుండెను. ఈకాలము