ఈ పుట ఆమోదించబడ్డది

       గంగినాయకుని సంగ్రామరంగంబున
             సింగంబు మత్తమతంగజముల
       బట్టుకైవడిబట్టి చట్టలెత్తించి కి
             న్కను నసహుండునై గంగినేని

    గీ. కొండ ప్రగ్ద్వారసీమ నుద్దండవృత్తి
       గంబముల బాతి తోరణగాగ గట్టి
       వినుతికెక్కెను సకలభూజనులచేత
       సోమదేవనృపాల సుత్రాము డెలమి"

అనియును భయంకరములయిన వీరకృత్యములు వర్ణింపబడియెను. ఇట్లేబాలభాగవతమునందు,

     "మణిగిళ్లదుర్లంబు మదిలోన గలుగు
      కణకదాడిగనేడి కైకొనినిలిచి
      గోనంగిమన్నేని గుపితాన్యనృపతి
      శాసకుం డగుట మస్తకము గొట్టించి
      ఆరసి తత్పట్టణాగ్రతటాక
      భైరవుముంగల బలి యొసగించె."

నని మఱియొకవీరకృత్యము వర్ణింప బడినది. ఈరీతిగా నన్యనృపతిశాసకు లయినదుర్గాధిపతుల నెల్లరనుజయించి కళ్యాణపురమునకును కంపిలికి నడుమనుండుదేశమును బరిపాలించిన యాంధ్రరాజీసోమదేవుడని దెలియ నగును. ఇతడు పెక్కు యజ్ఞము లాచరించి నట్లు బాలభాగవతమునందును నరపతివిజయమునందును దెలుప బడియెనుగాని నమ్మనర్హమైనదిగాదు.